కొల్చారంలో  మల్లినాథసూరి పేర సంస్కృత విశ్వ విద్యాలయం

కొల్చారంలో  మల్లినాథసూరి పేర సంస్కృత విశ్వ విద్యాలయం

స్థలాలు పరిశీలించిన ఉన్నత విద్యా  కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కలెక్టర్, ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, మెదక్: తెలుగు సాహిత్య రంగంలో జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చిన మల్లినాథ సూరి పేరిట ఆయన జన్మస్థలం మెదక్ జిల్లా కొల్చారంలో కోలాచల మల్లినాథసూరి పేర సంస్కృత విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు బుధవారం కొల్చారంలో  తెలంగాణ రాష్ట్ర  ఉన్నత విద్య కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి, అదనపు కలెక్టర్ రమేష్, కౌన్సిల్ వైస్ చైర్మన్ వెంకటరమణ, మహారాష్ట్రలోని రామ్టె టెక్  సాంస్కృతిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మధుసూదన్, ఉస్మానియా విశ్వవిద్యాలయం  సాంస్కృతిక అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ నీలకంఠం, కాలేజీ ఎడ్యుకేషన్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు డా. యాదగిరిలతో కలిసి విశ్వవిద్యాలయం కోసం  అధికారులు గుర్తించిన 30 ఎకరాల స్థలం,  మరోచోట గుర్తించిన 27 ఎకరాల స్థలాలను పరిశీలించారు. 
ఈ సందర్భంగా మాట్లాడుతూ కోలాచాలా మల్లినాథసూరి 
ఇక్కడి వారు కావడం జిల్లా ప్రజలు గర్వించదగ్గ విషయమన్నారు.. ఆయన స్వస్థలం  కొల్చారంలో కోలాచల మల్లినాథసూరి పేర సంస్కృత విశ్వ విద్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి  కార్యాచరణకు ఆదేశించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సాహిత్య రంగంలో మెదక్ జిల్లాకు వన్నె తెచ్చిన మల్లినాథసూరి స్వస్థలమైన కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయుటకు కార్యాచరణ  చేపట్టవలసినదిగా  రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా శాఖను ఆదేశించారని గుర్తు చేశారు. విద్యా శాఖామంత్రి సూచనల మేరకు కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రెండు ప్రాంతాలలో స్థలాలను పరిశీలించామని, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, నర్సాపూర్ శాసనసభ్యులు కూడా స్థలాలపై పూర్తి సమాచారమిచ్చారన్నారు. స్థలాలు రోడ్డుకు సమీపంలో ఉండడం, మౌలిక  సౌకర్యాలతో  సంస్కృత  విశ్వవిద్యాలయం ఏర్పాటుకు స్థలం ఎంపికకై సమగ్ర  నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని లింబాద్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో  గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి,  ఆర్డీఓ సాయి రామ్, తహశీల్ధార్ చంద్రశేఖర్,  జెడ్పిటిసి, ఎంపిపి, ఎం.పి.డి.ఓ, సర్పంచు తదితరులు పాల్గొన్నారు.