మానుకోట అభివృద్దే ధ్యేయంగా పనిచేయాలి:  మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక 

మానుకోట అభివృద్దే ధ్యేయంగా పనిచేయాలి:  మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక 

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్: మానుకోట అభివృద్ధికి సమిష్టిగా పని చేయవలసిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. మహబూబాబాద్  మున్సిపాలిటీ సమావేశం మందిరంలో గురువారం మున్సిపల్ చైర్మన్ డాక్టర్పాల్వాయి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ..సమావేశంలో కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. 120.27 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని సభ్యులందరూ ఆమోదం తెలపాలని కోరారు. ప్రతి సంవత్సరం ఉండే 24 కోట్ల బడ్జెట్ 30 కోట్లకు పెంచుకోగలిగామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్టేట్ ట్రేడ్ ఫైనాన్స్ క్రింద ప్రకటించిన 50 కోట్లు కు సంబంధించిన ఉత్తర్వులు వచ్చాయన్నారు. పట్టణ అభివృద్ధి కొరకు 30 కోట్లు అమృత కింద మిషన్ భగీరథ పనులకు 36 కోట్లు మంజూరయ్యాయి అన్నారు. పనులు ఏప్రిల్ మాసంతానికి పూర్తి చేయనున్నట్లు తెలియజేశారు. మిగతా ఐదు కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ పథకాల కింద సమకూరతాయన్నారు.  త్రాగునీరు సరఫరా మెరుగు, వీధిలైట్లు పెంపుతో మానుకోట అభివృద్ధి దశలో పరుగు పెడుతున్నదన్నారు. గతంలోని మానుకోట అభివృద్ధికి ప్రస్తుతం మానుకోట అభివృద్ధికి తేడా ప్రజలే గ్రహిస్తారన్నారు.

టౌన్ ప్లానింగ్ తో ఆదాయం పెరగడం అభివృద్ధి వేగవంతంగా ఉందంటానికి సూచిక అన్నారు. భూముల ధరలు పెరగడం ఇళ్ళ కిరాయిలు పెరగటం, కమర్షియల్ కాంప్లెక్స్ రావడం మున్సిపాలిటీకి ఆదాయం పెరిగేందుకు మార్గం సుగమం అయ్యిందన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించిన వాటికి ఇంటి నెంబర్లు మంజూరు చేసేందుకు త్వరలో స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరుగుతుందని 58 కానీ 59 కానీ ఏదైనా చర్యలు తీసుకుంటామన్నారు. మునిసిపాలిటీలో 21 500 ఇండ్లకు ఇంటి నెంబర్లు ఉన్నాయని  3,500 ఇండ్లకు ఇంటి నెంబర్లు లేవన్నారు . చెరువు శిఖరంలో గాని రోడ్లపై నిర్మించుకున్న 2000 ఇండ్లకు 1000 ఇండ్లు ఉంటాయన్నారు. మున్సిపాలిటీలో అక్రమంగా ఆక్రమణ లు చేస్తే కట్టడాలను తొలగిస్తామన్నారు జిల్లాలో మూడువేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్న ప్రభుత్వ స్థలాలకు భూమి లేదనడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. కార్యాలయాలకు ప్రభుత్వ సంస్థలకు కళాశాలలకు సొంత భవనాలు ఉంటేనే మునిసిపాలిటీ అభివృద్ధి చెందుతుందన్నారు.

జీవో 59 అనుమతి విషయంలో మార్నేని వెంకన్న, ఫ్లోర్ లీడర్ వెన్నం లక్ష్మారెడ్డి, బి అజయ్,సూర్ణపు సోమయ్య సభ్యుల సమస్యలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. నిర్మించిన భవనానికంటే ఖాళీ స్థలానికి రెండింతలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ.. పట్టణంలో కూడళ్ళ అభివృద్ధి సుందరీకరణ అవసరం అని బంధం  చెరువు, నిజాంసాగర్ చెరువు కంపాలపల్లి చెరువు అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణానికి రింగురోడ్డు అవసరమని తద్వారా విస్తరణ వేగంగా ఉంటుందన్నారు. మెడికల్ కళాశాలతో డాక్టర్లు విద్యార్థుల నివాసం కొరకు అవసరాలు పెరిగి పోయాయని అన్నారు. పాలిటెక్నికల్ కళాశాల రానున్నదని ఆఫీసర్స్ క్లబ్ చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని శ్రీనివాస టాకీస్ వద్ద కూడా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందన్నారు. సాధ్యమైనంత వరకు మున్సిపాలిటీలో అనుమతులు జారీ చేస్తూ నిధులు పెంచుకోవాలన్నారు. లక్ష్యం పెట్టుకుంటేనే ఆలోచనతో ముందుకు వెళ్లగలుగుతామని, తద్వారా అభివృద్ధి కనిపిస్తుంది అన్నారు. అదనపు నిధుల కోసం సమిష్టిగా పోరాడదాం అన్నారు. ఆదర్శ జిల్లానే లక్ష్యంగా పెట్టుకుందామని స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహణకు చర్యలు తీసుకుంటామన్నారు. యువతను సన్మార్గంలో పెట్టేందుకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

మహబూబాబాద్ శాసనసభ్యులు బానోతు శంకర్ నాయక్ మాట్లాడుతూ...


నెల్లికుదురు నుండి తాళ్లపూసల పల్లి రహదారిని ,తాళ్లపూసపల్లి నుండి ఈదుల పూసపల్లి వరకు రహదారులను తప్పనిసరిగా చేపడతామన్నారు. నిధులు ఖర్చు చేయడంపై ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టిగా ఆయా ప్రాంతాలలో పర్యటించి అంచనా వేయడం జరుగుతుందని అందుకు అనుగుణంగానే ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. నిజాం చెరువు అభివృద్ధికి గతంలో మంత్రి చందులాల్ కోటి రూపాయలు ఇచ్చినట్లు తెలియజేశారు.

ఆదాయం వనగూర్చుకునే మార్గాలను మున్సిపాలిటీ అధికారులు కౌన్సిలర్లు సమావేశమై చర్చించుకోవాలన్నారు. అదేవిధంగా హౌస్ టాక్స్ లను సకాలంలో వసూలు చేయాలని బిల్డింగ్ అనుమతులను కూడా జాప్యం చేయకుండా త్వరితగతిన జారీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సమస్యలు కూడా ఉన్నాయని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏవైనా పోరాడితేనే విజయాన్ని చూడగలుగుతామని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.