చాలీచాలని మిషన్ భగీరథ నీటి సరఫరా

 చాలీచాలని మిషన్ భగీరథ నీటి సరఫరా

ముద్ర ప్రతినిధి, మెదక్:  బిందె నెత్తుకొని మహిళలు బయటకు వెళ్లరాదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి నీటి సరఫరా కోసం మిషన్ భగీరథ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వం ఆశించిన మేరకు అన్నిచోట్ల లక్ష్యం నెరవేరడం లేదు. ఇందుకు నిదర్శనం మెదక్ పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా. పట్టణంలోని ఫతేనగర్, మాలబస్తీ, కోలిగడ్డ తదితర ప్రాంతాల్లో 20 నిమిషాలకో బిందె నిండే పరిస్థితి దాపురించింది. ఇంటిముందు కుళాయిల వద్ద  మిషన్ భగీరథ పైప్ నుండి సన్నని ధార రావడంతో బిందెలు నిండడం కష్టంగా మారింది.

కుళాయిల వద్ద నీటితో నింపుకోవడానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొందని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా వ్యవస్థ ఈ విధంగానే ఉందని పేర్కొన్నారు. నీరు తక్కువగా రావడం వల్ల ఒకటి, రెండు బిందెల నీటితో దాహం ఎలా తీర్చుకోవాలి, ఇంటి అవసరాలకు ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి మాసం మొదలు కావడం... ఎండలు మండుతున్నాయి, నీటి అవసరం పెరిగింది. ఈ పరిస్థితిలో చాలీచాలని నీటి సరఫరాతో బయట నుండి తెచ్చుకోవడం, ట్యాంకర్లు కొనుక్కుంటున్నామని తెలిపారు. సంబంధిత మిషన్ భగీరథ అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో నీటి సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


అధికారులకు తెలిపిన స్పందన లేదు-కౌన్సిలర్ జయరాజు
మా వార్డు పరిధిలో మిషన్ భగీరథ నీరు తక్కువ వస్తున్నాయని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం స్పందించడం లేదని కౌన్సిలర్ జయరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల అవసరాల మేరకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.