కంటి వెలుగు పై అధికారుల నిర్లక్ష్యం

కంటి వెలుగు పై అధికారుల నిర్లక్ష్యం
  • 10 గంటలు దాటిన కేంద్రంలో కానరాని సిబ్బంది
  • కేంద్రం చుట్టూ తిరుగుతున్న ప్రజలు

 ముద్ర ప్రతినిధి, వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంతో నీరు గారి పోతుంది. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయించాలని, అందులో కంటి చూపు మందగించిన వారికి అద్దాలు, చికిత్సలు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలో బుధవారం 10 గంటలు దాటిన కంటి పరీక్షలు నిర్వహించే కేంద్రానికి వైద్య సిబ్బంది రాకపోవడం పట్ల ప్రజలు విస్తూ పోతున్నారు.

గ్రామీణ ప్రాంతంలో రైతులు పొలం పనులకు వెళ్లే కూలీలు ఉదయమే పరీక్షలు చేయించుకొని తమ పనులకు వెళ్లి పోదామని చూస్తూ కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని, 10 గంటలు దాటిన వైద్య సిబ్బంది రాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో ఉదయమే పరీక్షా కేంద్రాన్ని తెరిచి ఉంచి పరీక్షలు చేయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో కతాలపను వివరణ కోరగా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ పూర్తిగా వైద్య శాఖ దేనిని, జిల్లా మండల వైద్యాధికారులు స్పందించి సరి చేసేలా చూస్తానని తెలిపారు. ఉదయం 9 గంటలకల్లా కేంద్రానికి రావలసిన సిబ్బంది రాకపోవడాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు.