జగన్​ను ఓడిస్తేనే హత్యా రాజకీయాలకు స్వస్తి

జగన్​ను ఓడిస్తేనే హత్యా రాజకీయాలకు స్వస్తి
  • వివేకానంద హత్య కేసు నిందితుడికి మళ్లీ ఎందుకు టికెట్​ఇచ్చారు
  • ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదు
  • కాంగ్రెస్​ ప్రచార యాత్ర ప్రారంభంలో పీసీసీ చీఫ్​ షర్మిల

ముద్ర, ఏపీ :కడప లోక్ సభ ఎన్నికల్లో ఓ వైపు రాజశేఖరరెడ్డి బిడ్డ.. మరోవైపు వివేకాను హత్య చేయించిన అవినాశ్ రెడ్డి ఉన్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదనే తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పారు. ధర్మం కోసం ఒకవైపు తాను... డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి మరోవైపు ఉన్నారని... ఎవరిని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి జగన్ మళ్లీ టికెట్ ఇచ్చారని విమర్శించారు. హంతకులను కాపాడేందుకే జగన్ సీఎం పదవిని వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. హత్యా రాజకీయాలకు ముగింపు పలకాలంటే జగన్, అవినాశ్ ను ఓడించాలని అన్నారు. కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో ఆమె బస్సు యాత్రను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్రలో వివేకా కూతురు సునీత, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో అద్భుత పథకాలను తీసుకొచ్చారని షర్మిల అన్నారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్ మెంట్, రుణమాఫీ వంటి ఎన్నో పథకాలను అమలు చేశారని కొనియాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్... అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చేవని చెప్పారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని విమర్శించారు.

కడప స్టీల్ ప్లాంట్ పై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉంటే అన్నీ పూర్తయ్యేవని చెప్పారు. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలంటే అవినాశ్​, జగన్‌ ను ఎన్నికల్లో ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలోకి రాకముందు ప్రత్యేక హోదా తీసుకొస్తానని హామీ ఇచ్చి గద్దెను ఎక్కిన జగన్‌ ఐదేండ్లలో ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాను సాధించి ఉంటే వంద పరిశ్రమలు వచ్చేవని, దీని ద్వారా రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించేదని అన్నారు. లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరికేవని పేర్కొన్నారు.

రాష్ట్రానికి రాజధాని లేకపోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, రామోహ్మన్‌ దంపతులు వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాగా, ఈ యాత్రలో వైఎస్ వివేకా కూతురు సునీత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత ప్రసంగిస్తూ కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిలను ప్రజలంతా దీవించాలని కోరారు. తన తండ్రి వివేకాను చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ జరుగుతోందని అన్నారు. తన తండ్రిని అత్యంత క్రూరంగా చంపేశారని... హత్య చేసిన వాళ్లే మళ్లీ ఎంపీ బరిలో ఉన్నారని మండిపడ్డారు. రాజశేఖరరెడ్డి ఉంటే దీన్ని సహించేవారా? అని ప్రశ్నించారు. షర్మిలను ఎంపీ చేయాలనేది తన తండ్రి చివరి కోరిక అని చెప్పారు. తన తండ్రి కోరిక నెరవేరాలంటే అవినాశ్ ను ఓడించాలని పిలుపునిచ్చారు.