జిల్లా ప్రజలు సంయమానంతో ఉండాలి

జిల్లా ప్రజలు సంయమానంతో ఉండాలి

సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్

 ముద్ర ప్రతినిధి,సిద్దిపేట:  అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించి సిద్దిపేట జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా,జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్  ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. సోమవారం గజ్వేల్ పట్టణంలో జరిగిన సంఘటన పై ఆ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల వారు విజ్ఞతతో ఆలోచించి ఎలాంటి పుకార్లు, ఫేక్ న్యూస్ లను నమ్మవద్దని ఏదైనా ఆందోళన కలిగిన,లేదా ఫిర్యాదు చేయాలన్న స్థానిక పోలీసులను సంప్రదించాలని కోరారు. చట్టాలను ఎవరి చేతిలోకి తీసుకోవద్దని,జిల్లా అధికార యంత్రాంగానికి, పోలీస్ శాఖ వారికి సహకరించి సంయమనం పాటించి జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం  కలుగకుండా నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

గజ్వేల్ ఘటనలలో  ఐదు కేసులు నమోదు ముగ్గురి అరెస్టు 
సిద్దిపేట పోలీస్ కమిషనర్: ఎన్.శ్వేతారెడ్డి 
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో జరిగిన వివిధ ఘటనలో ఐదు కేసులు నమోదు చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ నేరేళ్లపల్లి శ్వేతా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గత రాత్రి గజ్వేల్ లోని పిడిచేడు రోడ్ లో ఉన్న శివాజీ విగ్రహం వద్ద ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసి ఇతరుల మనోభావాలు దెబ్బతీసిన అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో మొదలైన ఘర్షణలో ఇప్పటివరకు మొత్తం ఐదు కేసులను నమోదు చేశామని తెలిపారు. గొడవల్లో ఇప్పటివరకు మొహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అఖిల్, మహ్మద్ జహీర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామన్నారు. ప్రజాశాంతికి భంగం కలిగిస్తూ ఘర్షణలకు పాల్పడే వారిని ఉపేక్షించమని చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె మంగళవారం గజ్వేల్ లో మీడియాతో తెలిపారు గజ్వేల్ ప్రాంతంలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలు పుకార్లను నమ్మవద్దని ఆమె ప్రజలకు సూచించారు.

అందరూ సంయమనం పాటించండి
గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి విజ్ఞప్తి
 గజ్వేల్ అంటే మతసహనానికి ప్రతీకా అని గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గుప్తా చెప్పారు మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ గజ్వేల్ ప్రశాంతతకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

500 మందితో పోలీసు బందోబస్తు 
గజ్వేల్ పట్టణ,పరిసర ప్రాంతాలలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు  జరగకుండా పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. అడిషనల్ డీసీపీలు ఇద్దరు, ఏసీపీలు, డిఎస్పీలు10, సిఐలు ఆర్ఐలు 25,ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు52, పోలీస్ సిబ్బంది 411 కలిపి మొత్తం 500 మంది తో బందోబస్తు తో  ఏర్పాట్లు చేసినట్లు సిద్దిపేట  సిపి తెలిపారు.రాజన్న సిరిసిల్ల జోన్ డీఐజీ కె.రమేష్ నాయుడు,పోలీస్ కమిషనర్ ఎన్,శ్వేత,కూడ  ఈ బందోబస్తు పర్యవేక్షణ చేస్తున్నారు.