మద్యం అవినీతి పరులకు జైలు తప్పదు

మద్యం అవినీతి పరులకు జైలు తప్పదు
  • మోడీ గ్యారంటీ అంటే వారంటీ
  • చేతులు కలిపిన కట్టర్, కరెప్ట్ పార్టీలు
  • కేసీఆర్ ఇక ఫాం హౌస్ కే
  • మెదక్ జిల్లా తుప్రాన్ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ
  • ఆకట్టుకున్న తెలుగు ముచ్చట్లు

ముద్ర ప్రతినిధి, మెదక్ : లిక్కర్ (మద్యం) స్కాం అవినీతి పరులకు జైలు తప్పదని భారత ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించారు. ఇది మోడీ గ్యారంటీ వారంటీ అన్నారు. రైతులను ముంచడంలో, అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయన్నారు. ఢిల్లీ కట్టర్, కరెప్ట్ తో కేసీఆర్ చేతులు కలిపారన్నారు. అన్నివర్గాలను మోసం చేసిన కేసీఆర్ ఇక ఫాం హౌస్ కే పరిమితం అవుతారన్నారు. ఆదివారం మెదక్ జిల్లా తుప్రాన్ బ్రాహ్మణపల్లి శివారులో  సకల విజయ సంకల్పసభలో నరేంద్రమోడీ పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో ఉగ్రవాదులు దాడులతో అనేకమందిని పొట్టన పెట్టుకున్నారన్నారు. ఇదే రోజు బొంబాయి దాడులను మోడీ గుర్తు చేశారు.

2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉగ్రవాదులు ఏ మూలాన ఉన్నా ఏరివేస్తూ శాంతి నెలకొల్పుతున్నామ్మన్నారు.  రాహుల్ గాంధీ అమేతి నుంచి వాయినాడ్ కు వచ్చినట్లు ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన కేసీఆర్ రెండు చోట్లపోటీ చేస్తున్నార్నారు. దేవుడి పేరా మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టి అమాయక రైతుల భూములు లాక్కుని వదిలేశారని మండిపడ్డారు. పాపం చేసేవారిని మల్లికార్జునస్వామి కాదు రైతులు, నిరుపేదలు క్షమించరని వ్యాఖ్యానించారు. భగవంతుడి పేరున ప్రజలను ముంచడం బాధాకరమన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు మరవడం ఆయన నైజం అన్నారు. తెలంగాణ వచ్చాక ఆయన కుటుంబం కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ప్రజలను కలవకుండా ఉండే.. ఫాం హౌస్ సీఎం కావాలా ఆలోచించాలన్నారు. పదేళ్లుగా సచివాలయం వెళ్లని ముఖ్యమంత్రి అవసరమా అంటూ తెలుగులో పేర్కొన్నారు.

ఫాం హౌస్ నుండి పాలన చేసిన సీఎంను పర్మినెంట్ గా ఫాం హౌస్ పంపాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారన్నారు. కాంగ్రెస్ ది కుంభకోణాల చరిత్ర అని వ్యాఖ్యానించారు. బీజేపీతోనే తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రోగాల నుంచి బీజేపీ చికిత్స చేసి రక్షిస్తుందన్నారు. వీరి పాలనలో కొన్ని కుటుంబాలే బాగుపడ్డాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసిన కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి దేశాన్ని లూటీ చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు.  మధ్యం అవినీతిలో కట్టర్, కరెప్ట్ పార్టీలు చేతులు కలిపాయన్నారు. విచారణ జరుగుతుందని, కొందరు జైలులో ఉన్నారు.. మరికొందరికి జైలు తప్పదు, ఎవరు తప్పించుకోలేరని, మొబైల్ మారిన తప్పదని పరోక్షంగా కవితను హెచ్చరించారు. ఇది మోదీ గ్యారంటీ వారంటీ అంటూ స్పష్టం చేశారు.  ఈ సభలో బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, పార్లమెంట్​ పరిధిలోని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మురళీయాదవ్, పంజా విజయ్ కుమార్, పులిమామిడి రాజు, దూది శ్రీకాంత్ రెడ్డి, నందీశ్వర్ గౌడ్, నాయకులు మల్లారెడ్డి ప్రేమేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఆకట్టుకున్న మోదీ తెలుగు
మోడీ తెలుగులో పలుమార్లు మాట్లాడి ప్రజలను ఆకట్టుకున్నారు. ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు, ప్రియమైన ప్రజలారా, నాచారం లక్ష్మి నరసింహస్వామిని స్మరిస్తూ, నా కుటుంబ సభ్యులారా’ అంటూ పలుమార్లు తెలుగులో ప్రస్తుతించారు. అలాగే ప్రజలను కలవని ముఖ్యమంత్రి మనకు కావాలా? సచివాలయం వెళ్లని ముఖ్యమంత్రి మనకు అవసమా అంటూ తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు.