రేపు 80 గిరిజన జిపిలలో ప్రత్యేక సభలు కలెక్టర్ రాజర్షి షా

రేపు 80 గిరిజన జిపిలలో ప్రత్యేక సభలు కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్: రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం 80 గిరిజన  గ్రామ పంచాయతీలలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తున్నామని  జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం తెలిపారు. ఆయా గ్రామాలలో ప్రజలు గిరిజన సంప్రదాయ దుస్తుల్లో ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామ సభలో ఆరు రకాల ఫ్లెక్సీలు  ఏర్పాటు చేయడంతో పాటు  గిరిజనుల సంక్షేమం కోసం తండాలను గ్రామ పంచాయతీలుగా హోదా కల్పించిన విషయాన్ని, విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్, బంజార భవనం , ఆదివాసీ భవనం ఏర్పాటు,  కొమరం భీం, సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహిస్తున్న విషయాలను  గిరిజన ప్రజలకు వివరించాలన్నారు.

ఈ సందర్భంగా గిరిజన పెద్దలతో మాట్లాడించి, సన్మానాలు చేయాలని అన్నారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం  అమలు చేస్తున్న పధకాలు,లబ్ధిపొందిన వివరాలతో  ముద్రించిన కరపత్రాలు ఆవిష్కరించి పంపిణి చేయాలని, అదేవిధంగా  డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించాలన్నారు. 57 గ్రామ పంచాయతీలకు నూతనంగా మంజారు చేసిన గ్రామ  పంచాయతీ భవన  నిర్మాణానలకు శంఖుస్థాపన ఏర్పాట్లు చేయాలని పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.  మెదక్ మండలం  మల్కాపూర్ తండాలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాసాయిపేట మండలం రామంతాపూర్  తండాలో నర్సపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొంటారని ఆయన తెలిపారు.