మెదక్‌ నుంచి రాములమ్మ పోటీ?

మెదక్‌ నుంచి రాములమ్మ పోటీ?
Ramulamma contest from Medak?

గత ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ.. వచ్చే ఎలక్షన్లలో పోటీ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి. ఇప్పటికే ఆమె పోటీ చేసే నియోజకవర్గాలపై అనేక ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. మొన్నటి వరకు మల్కాజ్‌గిరి లోక్‌సభ సీటుపై రాములమ్మ ఫోకస్‌ పెట్టారని కమలం పార్టీలో చెవులు కొరుక్కున్నారు. తాజాగా విజయశాంతి చేసిన వ్యాఖ్యలతో కొత్త చర్చ మొదలైంది. పొయిన చోటే వెతుక్కునే యోచనలో ఉన్నారా అని సందేహిస్తున్నాయి పార్టీ వర్గాలు.తల్లి తెలంగాణ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశాక.. 2009లో మెదక్‌ ఎంపీగా గెలిచారు విజయశాంతి. 2013లో టీఆర్‌ఎస్‌తో గ్యాప్‌ రావడం.. మరుసటి ఏడాది ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరడం చకచకా జరిగిపోయాయి. 2014 ఎన్నికల్లో మెదక్‌ లోక్‌సభకు కాకుండా.. అసెంబ్లీకి కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేశారు విజయశాంతి. కానీ.. ఓడిపోయారు. తర్వాతి కాలంలో రాజకీయాల్లో చురుకునై పాత్ర పోషించలేదు. 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 

క్రమంగా కాంగ్రెస్‌ పార్టీకి దూరం జరిగి.. తిరిగి బీజేపీ గూటిలోకి వచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేయాలని విజయశాంతి అనుకుంటున్నారట. అయితే ఎక్కడ నుంచి బరిలో ఉంటారనేది రాములమ్మ బయట పెట్టడం లేదు. కానీ.. ఆమె కదలికల చుట్టూ చర్చ జోరుగానే సాగుతోంది.గతంలో తాను ఎంపీగా ఉన్న మెదక్‌ లోక్‌సభ పరిధిలో అడపాదడపా పర్యటిస్తున్న విజయశాంతి.. పెద్దగా చర్చల్లోకి వచ్చింది లేదు. కానీ.. తాజా పర్యటనలో ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మళ్లీ మెదక్‌ నుంచి విజయశాంతి పోటీ చేస్తారా అనే ప్రశ్నలకు ఆస్కారం కల్పించారు. తాను శివ భక్తురాలినని.. కాశీకి వెళ్దామనుకుంటే.. ముక్కంటి కలలో కనిపించి మెదక్‌ వెళ్లమని చెప్పారని విజయశాంతి వెల్లడిరచారు. స్థానికంగా ఉన్న కాలబైరవ ఆలయానికి వచ్చారు. అక్కడికి వచ్చిన వాళ్లను ఉద్దేశించి రాములమ్మ చేసిన వ్యాఖ్యలే హాట్‌ టాపిక్‌ అయ్యాయి.ఇంతమందిని చూస్తుంటే తాను మళ్లీ మెదక్‌ ఎంపీ అయ్యానేమో అని అనిపించిందని విజయశాంతి ముక్తాయించారు. అంతే మెదక్‌పై మనసులో బలమైన కోరిక ఉంది కాబట్టే ఆ మాట అన్నారని ఎవరికివారుగా విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మెదక్‌ ఎంపీగా పోటీ చేయాలనే ఆశతోనే ఆ కామెంట్‌ చేశారనేది కొందరి వాదన. గతంలో మెదక్‌ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోవడంతో మళ్లీ అక్కడ నుంచి పోటీ చేస్తారా అని కొందరు డౌట్‌ పడుతున్నారట. పోయినచోటే వెతుక్కునే ఆలోచనలో.. రాములమ్మ అడుగులు పడుతున్నారని భావిస్తున్నారట. మరి.. మెదక్‌ నుంచి పోటీ చేసేది ఖాయమైతే.. అది అసెంబ్లీకా.. లోక్‌సభకా అనేది విజయశాంతి ఎప్పుడు స్పష్టం చేస్తారో?.