పోలింగ్ రోజు నిర్వహించే విధుల పట్ల, ఇ.వి.ఎం. యంత్రాల పని తీరుపై సంపూర్ణ అవగాహన కలిగి వుండాలి

పోలింగ్ రోజు నిర్వహించే విధుల పట్ల, ఇ.వి.ఎం. యంత్రాల పని తీరుపై సంపూర్ణ అవగాహన కలిగి వుండాలి
  •  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే 

ముద్ర ప్రతినిధి భువనగిరి :పోలింగ్ రోజు నిర్వహించే విధుల పట్ల, ఇ.వి.ఎం. యంత్రాల పని తీరుపై సంపూర్ణ అవగాహన కలిగి వుండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే  ప్రిసైడింగ్, అసిస్టెంట్  ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు.సోమవారం భువనగిరి పట్టణంలోని వెన్నెల కాలేజీలో భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి ప్రిసైడింగ్, అసిస్టెంట్  ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ విధానంపై జరిగే రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు గాను 1052 ప్రిసైడింగ్ అధికారులకు, 1054 అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పి.ఓ, ఎ.పి.ఓ. అధికారుల పాత్ర కీలకమని, పోలింగ్ రోజు నిర్వహించే విధుల పట్ల, ముఖ్యంగా ఇ.వి.ఎం. యంత్రాల పనితీరు పట్ల పూర్తి అవగాహన పొందాలని, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వి.వి. ప్యాట్లను పోలింగ్ కేంద్రాలలో అమర్చడం, మాక్ పోలింగ్ నిర్వహణపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రిసైడింగ్ అధికారుల హ్యాండ్ బుక్ లోని ప్రతి అంశాన్ని తెలుసుకొని ఉండాలని,  ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్ లో సూచించిన విధంగా మొత్తం పోలింగ్ సామాగ్రిని సేకరించుకోవాలన్నారు.

ఫారములు, కవర్స్, మెటీరియల్స్, ఇవిఎం యంత్రాలలో క్లోజ్, రిజల్టు, క్లియర్ వ్యవస్థలపై, వీవీప్యాట్ లో 7 సెకన్లలో వచ్చే స్లిప్స్ పై అవగాహన పొందాలని,  పోలింగుకు ముందు మాక్ పోల్ నిర్వహించాలని, మాక్ పోల్ సమయంలో కనీసం 50 ఓట్లు వేయాలని,  నిర్ణీత సమయానికి పోలింగ్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఓటింగు గోప్యత నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని,  బ్యాలెట్ గోప్యతను కాపాడే విధంగా ఓటింగ్ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.  పోలింగ్ స్టేషన్ ప్రాంతం,  ఓటర్ల వివరాలు తెలిపే నోటీసు బోర్డులు, ఫారం -7 లో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాని పోలింగ్ స్టేషన్ బయట ప్రదర్శించాలని, ఓటర్లకు అవసరమైన సహాయం అందించడానికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు.

పోలింగ్ సందర్భంలో వచ్చే టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓటు, టెస్ట్ ఓట్లపై అవగాహన పెంచుకోవాలని, పోలింగ్ పూర్తయిన తర్వాత కంట్రోల్ యూనిట్ లో క్లోజ్ బటన్ పోలింగ్  ఏజెంట్ల ముందు చేసి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఫామ్ 17-C లో  పోలింగ్ వివరాలు ఎలాంటి తప్పులు లేకుండా ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. చూపులేని దివ్యాంగ ఓటర్లు సహాయకుడితో ఓటు వేసేందుకు ఫామ్ 14-A నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్ లోని  సూచనల ప్రకారం అన్ని పత్రాలను సీల్ చేయాలని తెలిపారు. ఎన్నికల విధులలో పాల్గొనే వారు తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, అందుకోసం ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సౌకర్యం కల్పించడం జరిగిందని, మీరందరూ పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు ఫారం-12 D ద్వారా వివరాలు ఇవ్వాలని, మీకు ఓటు హక్కు ఉన్న నియోజకవర్గం సంబంధించిన అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా మీరు ఓటు వేసే సౌకర్యం కల్పించడం జరిగిందని, అందుకు గాను స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.శిక్షణా కార్యక్రమాలలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్, భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి అమరేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి జగన్మోహన్ ప్రసాద్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్స్,  అసెంబ్లీ స్థాయి ట్రైనర్స్ శిక్షణ,  అవగాహన కల్పించారు.