పోలీసు పహారా మధ్య పాలన

పోలీసు పహారా మధ్య పాలన
  • పనులు పూర్తి కాకున్నా ప్రారంభోత్సవాలు సిగ్గుచేటు.
  • డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు..

ముద్ర ప్రతినిధి,నిర్మల్: రాష్ట్రంలో పోలీసు పహారా మధ్య పరిపాలన సాగుతోందని, రాజ్యాంగ బద్ధమైన హక్కులను అడ్డుకుంటున్నారని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు విమర్శించారు. నిర్మల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బుధవారం ఆయనను పట్టణ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులను ఛేదించుకొని గుండంపల్లి గ్రామానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి చేరుకున్నారు. మంత్రి కేటీఆర్ వచ్చే సమయంలో హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు యత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులను పోలీసులతో అరెస్ట్ చేయించి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకోవడం సిగ్గు చేటని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరిపై ఉందని కానీ పోలీసులు నిర్బంధాలతో అరెస్టులు చేయించడం సరికాదని పేర్కొన్నారు. 27 ప్యాకేజీ పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రారంభోత్సవానికి హెలిప్యాడ్ లో వచ్చి ప్రజా ధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. బహిరంగ సభకు నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల నుండి ప్రజలను తరలించి సభ విజయవంతం అయిందని చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.