ఆరాచక శక్తులకు, అవినీతిపరులకు స్థానం లేదు

ఆరాచక శక్తులకు, అవినీతిపరులకు స్థానం లేదు
  • మహిళలలో చిరునవ్వులు చూస్తా: మంత్రి శ్రీధర్ బాబు

మహాదేవపూర్, ముద్ర: మంథని నియోజకవర్గం లో అరాచక శక్తులకు స్థానం ఇవ్వలేమని, తన సొంత గ్రామంలోకూడా ప్రభావం ఉన్నదని, వాటన్నింటిని నిర్మూలించి నీతివంతమైన పాలన అమలు చేస్తామని ప్రజల హర్షద్వానాకల మధ్య రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంత్రి స్వంత గ్రామమైన ధన్వాడలో ప్రజాపాలన కార్యక్రమంలో శ్రీధర్ బాబు పాల్గొని ప్రసంగించారు. ఆరు గ్యారెంటీలతో మహిళల ముఖంలో చిరునవ్వులను చూస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ధన్వాడలో ప్రజల కోసమే దేవాలయం కట్టిస్తే అందులో కొందరికే ప్రవేశం అంటూ లేవనెత్తిన ప్రచారం బాధ కలిగిస్తుందన్నారు. తనపై, తన తండ్రిపై, తన కుటుంబం పై హవా కుల్చవాక్కులు పేలినా పేద ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా సాగుతానన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా ప్రతి కుటుంబానికి సుమారు మూడు వేల రూపాయల ఆదా జరుగుతుందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని రెండు లక్షల రూపాయలు నుండి ప్రారంభించి ఏకంగా నేడు 10 లక్షల రూపాయల వరకు చేసిందని తెలిపారు. భార్యలను జాగ్రత్తగా చూసుకోకుంటే బస్సు ప్రయాణాలు తప్పవని నవ్వుల జల్లు కురిపించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో, నియోజకవర్గంలో న్యాయబద్ధమైన పాలన, అవినీతి రహిత పాలన అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అధికారులు చట్టానికి లోబడి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ప్రజలకు మేలు చేయాలని కోరారు. ధన్వాడ గ్రామం నుండి బూరుగుపల్లి వరకు రోడ్డు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. మహాలక్ష్మి తో పాటు ప్రభుత్వ పథకాలన్నీ అమలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. నవ్వుతూ ప్రజల దరఖాస్తుల స్వీకరించి అధికారులు ప్రజలకు బాసటగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, సర్పంచ్ జంగిలి నరేష్, ఎంపీటీసీ బోడ మమత, వార్డ్ సర్పంచులు తాసిల్దార్, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు. మంత్రిని కలవడానికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు.