ప్రతిమ హోటల్ పై స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీస్ రైడ్స్

ప్రతిమ హోటల్ పై స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీస్ రైడ్స్
  • భారీగా మోహరించిన పోలీసు బలగాలు
  • 6.65 కోట్ల డబ్బు స్వాధీనం

ముద్ర ప్రతినిధి కరీంనగర్ :పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కు  ఒక రోజు ముందు కరీంనగర్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఒంటిగంటకు ప్రతిమ హోటల్ పై స్పెషల్ టాస్క్ ఫోర్స్   పోలీసులు సోదాలు  నిర్వహించారు. పెద్ద ఎత్తున హోటల్లో డబ్బు ఉందన్న కీలక సమాచారం మేరకు పెద్ద ఎత్తున పోలీసు  బలగాలను మోహరించి హోటల్ ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 6 గంటలుగా కొనసాగుతున్న సోదాల్లో  పెద్ద ఎత్తున డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం. అయితే ఈ డబ్బు ఎవరిది? ఎక్కడిది? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

కెసిఆర్ సభకు ముందు రోజే హోటల్ కు డంపు   తరలింపు?

కరీంనగర్ లో బిఆర్ఎస్ పార్టీ  కదనబేరి మహాసభను ఈనెల 12న  ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం లో నిర్వహించింది. అయితే ఈ  మహాసభకు ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పాల్గొని ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల ఖర్చు నిమిత్తం వినోద్ కుమార్ కు పార్టీ ఫండ్ ఇవ్వడంతో అదేరోజు  ప్రతిమకు హోటల్లో ఆ డబ్బును భద్రపరిచినట్లు పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తుంది.

సమాచార లీక్ వీరుడు ఎవరు?

ప్రతిమ హోటల్లో డబ్బు ఉందన్న సమాచారం ఇచ్చిన లీక్ వీరుడు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అత్యంత విశ్వాసనీయుల మధ్య జరిగే ఈ ప్రక్రియ ఎలా లీక్ అయిందన్న చర్చ జోరుగా సాగుతుంది. అయితే దీని వెనకాల రాజకీయ కుట్ర దాగి ఉంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. అదే నిజమైతే కీలక నేతల మధ్య ఉండే ముఖ్య సమాచారం ఎందుకు బయటకు వచ్చిందన్న సమాచారం తెలియాల్సి ఉంది.

విచారణ చేపట్టాం.. డబ్బు కోర్టులో డిపాజిట్ చేస్తాం...

కరీంనగర్ టౌన్ ఏసిపి నరేందర్

ప్రతిమ హోటల్ లో  డబ్బు ఉందన్న సమాచారం మేరకు సోదాలు నిర్వహించడం జరిగింది. 6.65 కోట్ల డబ్బు స్వాధీనం చేసుకున్నాం. విచారణ కొనసాగుతోంది. స్వాధీనం చేసుకున్న డబ్బును కోర్టులో డిపాజిట్ చేస్తాం . పూర్తి విచారణ అనంతరం  తదుపరి విషయాలు వెల్లడిస్తాం.