అనుమతి జానెడు తవ్వుతోంది బారెడు

అనుమతి జానెడు తవ్వుతోంది బారెడు
  • ఇష్టారాజ్యంగా చెరువుల్లో తవ్వకాలు
  • రూపుకోల్పోతున్న సాగునీటి వనరులు
  • పట్టించుకోని రెవెన్యూ, ఇరిగేషన్, విజిలెన్స్ అధికారులు

గంగాధర ముద్ర :‘అనుమతులు జానెడు.. తవ్వుతోంది బారెడు..’ ఇదీ గంగాధర మండలంలోని పలు చెరువుల్లోని మట్టి తరలింపు పరిస్థితి. గుత్తేదారులు, రాజకీయ నాయకుల చూపు చెరువులపై పడింది. అనుమతుల పేరుతో మట్టి తవ్వకాలు జోరందుకోవడంతో మట్టి వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఓ వైపు అనుమతులు తీసుకుంటూనే అంతకు రెండు, మూడింతలు మించి అక్రమంగా తరలిస్తున్నారు. యంత్రాలతో విచ్చలవిడిగా తవ్వేస్తూ సాగునీటి వనరులను ధ్వంసం చేస్తున్నారు. అనుమతులు ఇచ్చిన అధికారుల నుంచి జేసీబీ యజమాని, సాగునీటి సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, ట్రాక్టర్ల యజమానులు, చెరువులో ఆక్రమించుకున్న భూమి ఉన్న రైతు ఉంటే అతనికి, మట్టి తరలింపుల వైపు కన్నెత్తి చూడకుండా ఉండేందుకు రెవెన్యూ, ఇరిగేషన్, విజిలెన్స్, మైనింగ్ సిబ్బందికి తగిన రీతిలో నగదు పంచుతున్నారు. పలు శాఖల అధికారులు, సిబ్బంది ఈ అక్రమ తవ్వకాలతో లబ్ధిపొందుతుండడంతో ఎక్కడా ఢోకా లేకుండా తరలింపులు జరుగుతున్నాయి. అధికారిక అనుమతులు ఉంటే ఎవరూ అడ్డుపడరనే ధైర్యంతో ఇష్టమొచ్చినంత మట్టిని అమ్ముకుని కాసులు దండుకోవచ్చనే అభిప్రాయంతో ఏకంగా 12 టైర్ల  లారీల్లో పరిమితికి మించి ఎలాంటి రక్షణ చర్యలు పాటించకుండా 40 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల దూరం మట్టిని తరలిస్తున్నారు.

గంగాధర మండలం గంగాధర, ఉప్పరమల్యాల చెరువులో యంత్రాలతో మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఇక్కడి చెరువు మట్టిని చింతకుంట, కమాన్పూర్, మొగ్ధుంపూర్, గట్టుభూత్కూర్ శివారులోని ఇటుక బట్టీలతోపాటు పెద్దపల్లి జిల్లాలోని పలు ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఇరిగేషన్‌శాఖకు ఒక క్యూబిక్‌ మీటరుకు రూ.30 చొప్పున ఆరువేల క్యూబిక్‌ మీటర్లకు 12 చలానాలతో అనుమతి పొందారు. చెరువులో 0.90 మీటర్ల లోతుతో మట్టి తీయాల్సి ఉండగా ఐదారు ఫీట్ల లోతుతో మట్టి తీస్తున్నారు. అధికారికంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా, అటవీశాఖ అధికారుల అనుమతి లేకుండానే తుమ్మ చెట్లను పీకేసి మట్టిని తవ్వుతున్నారు. కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తులు అనుమతులు గోరంత తవ్వకం కొండంత అన్న రీతిలో రాత్రింబవళ్లు 30 లారీల్లో వందల కొద్దీ ట్రిప్పుల చొప్పున లారీల్లో తరలిస్తున్నారు. పలువురు ఇరిగేషన్‌శాఖ అధికారులు రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్ల చేతిలో కీలుబొమ్మల్లా మారడంతో అక్రమ తవ్వకాలకు అడ్డుపడడం లేదు. ఈ వ్యవహారంలో స్థానిక రాజకీయ నాయకులు, సాగునీటి సంఘాల నాయకుల పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.