నేరస్థులకు శిక్షలు పడేలా విధులు నిర్వహించాలి

నేరస్థులకు శిక్షలు పడేలా విధులు నిర్వహించాలి

అడిషనల్ డిసిపి సి రాజు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: ప్రతినేర సంఘటనలో నిందితులు శిక్షింపబడేలా కోర్టుడ్యూటీ అధికారులు పగడ్బందీ చర్యలు తీసుకోవాలని కరీంనగర్ అడిషనల్ డిసిపి (పరిపాలన) సి. రాజు అన్నారు. శ్రద్ధాసక్తులు, ఉత్సాహంతో పనిచేయడం ద్వారా సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. శనివారం పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో కోర్టుడ్యూటీ అధికారుల(సిడీవో) , సమన్స్ & వారెంట్స్ అధికారుల శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ డిసిపి(పరిపాలన) సి రాజు మాట్లాడుతూ ప్రతి కేసులోని దశలను సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడూ తెలియజేస్తూ పటిష్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా నిందితులు శిక్షింపబడుతారనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. సిడివోలు కేసులు ఏయే దశల్లో ఉన్నాయో ఎప్పటికప్పుడు సిసిటిఎన్ఎస్ లో అప్లోడ్ చేయాలని చెప్పారు. ఏరోజు పనిని ఆరోజే పూర్తిచేయాలని, వాయిదా వేయడం పద్దతి సరైందికాదని సూచించారు.

ఏనేర సంఘటనైనా సరైన సాక్ష్యాలను సేకరిస్తూ, సాక్ష్యులను సకాలంలో కోర్టుల్లో ప్రవేశపెడుతూ ప్రణాళికబద్దంగా ముందుకుసాగితే సఫలీకృతం అవుతామనే విషయాన్ని గుర్తించాలని తెలిపారు. నిందితులు శిక్షింపబడటం ద్వారా పోలీస్ శాఖ ప్రతిష్ట పెంపొందడంతోపాటు అన్నివర్గాల ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. నిందితులు శిక్షింపబడటంలో నూతనోత్సాహంతో పనిచేసే సిడివోలకు ప్రోత్సాహకాలను అందజేస్తామని ప్రకటించారు. ఈ నెల 12 వ తేదీన తల్లిని చంపిన కొడుకు( నిందితునికి) కేసులో కోర్టు ద్వారా జీవిత ఖైదు శిక్ష విధించబడేలా కృషి చేసిన కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ జాన్ కి పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు నగదు రివార్డ్ ప్రకటించారని తెలిపారు.

నేరస్థులు శిక్షింపబడటం ద్వారా నేరాలు నియంత్రణలోకి రావడంతోపాటు. పాతనేరస్థులు నేరాలకు పాల్పడకపోయే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. సమన్స్ మరియు వారెంట్స్ అధికారులు వారికి కోర్టుల ద్వారా అందజేయబడిన సమన్లను మరియు వారెంట్స్ ను ఎప్పటికప్పుడు అందుకుంటూ వివిధ కేసుల్లో వున్న వ్యక్తులకు , నిందితులకు త్వరితగతిన అందజేస్తూ, సంబంధిత కోర్టుల్లో హాజరుపరిచేలా ప్రణాళికబద్దంగా విధులు నిర్వహించాలని కోరారు. దీని ద్వారా నిందితులకు శిక్షలు పడడమే కాకుండా పెండింగ్ లో వున్న కేసుల సంఖ్య తగ్గి, సమాజంలో పోలీస్ శాఖ ప్రతిష్ట పెరుగుతుందని తెలిపారు. సిడివోలతోపాటు ఇతర విభాగాలకు చెందిన అధికారులు విధులపట్ల తమలో నెలకున్న అనుమానాలను సంబంధిత అధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలని, టెక్నాలజీ పరంగా తమకు సేవలనందించేందుకు కమిషనరేట్ కేంద్రంలో ఐటి సెల్ విభాగాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.