మోగిన నగారా!

మోగిన నగారా!


నోటిఫికేషన్​ : నవంబర్ – 3
నామినేషన్లకు ఆఖరు తేదీ  – నవంబర్​10
నామినేషన్ల పరిశీలన  – నవంబర్​ 13
నామినేషన్ల ఉపసంహరణ  – నవంబర్​ 15
పోలింగ్​ తేది   – నవంబర్​3‌‌0
ఓట్ల లెక్కింపు  – డిసెంబర్​ 3

అసెంబ్లీ నియోజకవర్గాలు : 119
(జనరల్ – 88, ఎస్సీ – 19, ఎస్టీ –12 రిజర్వ్ డ్) 

మొత్తం ఓటర్లు   – 3.17 కోట్లు
పురుష ఓటర్లు  – 1,58,71,493
మహిళలు   – 1,58, 43, 339
సర్వీస్ ఓటర్లు-   – 15, 338
ప్రవాస ఓటర్లు-   – 2, 780 

తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు – 8.11 లక్షలు
దివ్యాంగులు : 5.06లక్షలు
80 ఏళ్లు పైబడినవారు (ఓట్​ ఫ్రం హోం) – 4.04లక్షలు
100 ఏళ్లు దాటిన ఓటర్లు – 7,005
కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్య –  17,01,087

రాష్ట్రంలో మొత్తం పోలింగ్​ కేంద్రాలు – 35,356
వెబ్​ క్యాస్టింగ్​ కేంద్రాలు  – 27,798 (78శాతం)
మహిళా పోలింగ్​ కేంద్రాలు  – 597
మోడల్​ పోలింగ్​ కేంద్రాలు  – 644
ప్రతిపాదిత దివ్యాంగ పోలింగ్​ కేంద్రాలు – 120
రాష్ట్రవ్యాప్తంగా చెక్​ పోస్టులు  – 148

  • మోగిన నగారా!
  • నవంబర్​30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
  • అమల్లోకి ఎన్నికల కోడ్​
  • ఎన్నికల ఖర్చుపై ఎన్నికల కమిటీ నిఘా
  • ప్రలోభాలకు లొంగొద్దంటూ సీఈసీ సూచన
  • వివరాలు వెల్లడించిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్


తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఎంతో ఉత్కంఠను రేపిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్​30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, ఓటర్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావాళిని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సోమవారం ఢిల్లీలో వెల్లడించారు.షెడ్యూల్ విడుదల చేసిన మరుక్షణం నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈమేరకు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ప్రభుత్వాలప‌రంగా ఎలాంటి హామీలు, అధికారిక ప్రక‌ట‌న‌లు, జీఓలు జారీ చేసేందుకు వీలు లేదని సీఈసీ ప్రకటించింది. 

ముద్ర, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్​అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఎన్నికల సిబ్బంది ఎన్నికల రిపోర్టులు సకాలంలో ఎలక్షన్ కమిషన్ కు సమర్పిస్తూ.. ఏ పార్టీ ప్రలోభాలకు లొంగకుండా విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. తెలంగాణలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టిన కేంద్ర ఎన్నికల కమిషన్.. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, అధికారుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టింది. 

నియమావళిని తప్పకుండా పాటించాలి..

ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూ.చా తప్పకుండా పాటించాలని అన్ని రాజకీయ పార్టీలను కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కోరారు. అదే నియమావళికి లోబడి పనిచేయాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు.. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు తమ అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ కార్యకలాపాలకు పాలన యంత్రాంగాన్ని వినియోగించకూడదు. ఎమ్మెల్యేలు,మంత్రులు అధికారిక పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండు కలిపి చేయకూడదు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎవరూ ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు. సీఎం సైతం అధికారిక హెలికాప్టర్ ను ఉపయోగించకూడదు. ఇంటి నుంచి కార్యాలయానికి, కార్యాలయం నుంచి ఇంటికి తప్ప మరే ఇతర పనులకు ప్రభుత్వ వాహనాలను కోడ్ సమయంలో ఉపయోగించకూడదు. అధికారపార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ కార్యకలాపాలకు పాలన యంత్రాంగాన్ని వారు వినియోగించకూడదు. ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారిక పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండు కలిపి చేయకూడదు. పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు ఇచ్చే ముందు ప్రకటనకు సంబంధించిన వివరాల సీడీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించి అనుమతి పొందిన తర్వాతే ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుందని సీఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు.. రాజకీయ పార్టీలు ఎలక్షన్ కోడ్ ను అనుసరించి ఎన్నికల వ్యయాన్ని లెక్క చూపించాలి. ప్రభుత్వ వసతి గృహాలు,హెలిపాడ్ లు, సభా స్థలాల ఇతర సౌకర్యాలు కేవలం అధికార పార్టీ వారి వినియోగానికి మాత్రమే కాకుండా, ఇతర పార్టీల వారికి కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, ప్రస్తుత తెలంగాణ‌ అసెంబ్లీ గడువు 2014 జనవరి 16తో ముగియనున్న విషయం తెలిసిందే. దీంతో అప్పటిలోగా ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్​ నిర్ణయం తీసుకుంది. 

ఐదు రాష్ట్రాలు.. 679 అసెంబ్లీ సెగ్మెంట్లు!

తెలంగాణతో సహా రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ విడుదలైన వెంటనే 5 రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. 230 నియోజకవర్గాలున్న మధ్యప్రదేశ్ లో నవంబర్ 17 పోలింగ్​, డిసెంబర్ 3న ఫలితాలు, 200 సెగ్మెంట్లు ఉన్న రాజస్థాన్​లో నవంబర్​ 23న పోలింగ్, డిసెంబర్​3న ఫలితాలు, 40 నియోజకవర్గాలున్న మిజోరాంలో నవంబర్ 7న పోలింగ్​ డిసెంబర్​3న ఫలితాలు వెలువడనున్నాయి. 119 సెగ్మెంట్లు ఉన్న ఛత్తీస్​గఢ్​లో నవంబర్​ 7, 17న రెండు దశల్లో పోలింగ్​జరగనుంది. ఫలితాలు మాత్రం డిసెంబర్ 3నే వెలువడనున్నాయి. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని, 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాజీవ్ కుమార్ తెలిపారు.

చివరి పనులు అవే..!

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో శంకుస్థాపనలు, అభివృద్ధి పనులకు బ్రేక్​ పడింది. షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసుకున్నాయి. సోమవారం మధ్యాహ్నం ట్రైబల్ రీసర్చ్ ఇన్​స్టిట్యూట్ ప్రారంభోత్సవం, రాంజీగోండు స్మారక ట్రైబల్ మ్యూజియానికి శంకుస్థాపనకు అధికారులు ఏర్పాట్లు చేయగాఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయాయి. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్​ను సోమవారం ఎన్నికల కోడ్​అమలుకు ముందే మంత్రి కేటీఆర్​అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్ర బీజేపీ చీఫ్​ కిషన్ రెడ్డి హడప్సర్– హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట వరకు.. అలాగే జైపూర్ - కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ను కర్నూల్ పట్టణం వరకు.. నాందేడ్ - తాండూర్ ఎక్స్‌ప్రెస్‌ను రాయచుర్ వరకు.. కరీంనగర్ - నిజామాబాదు పాసింజర్‌ను బోధన్ వరకు షెడ్యూల్ రాకముందే ప్రారంభించారు.