ఎన్నికల ప్రక్రియ స్టార్ట్​

ఎన్నికల ప్రక్రియ స్టార్ట్​
  • బదిలీలపై ఆదేశాలిచ్చిన ఈసీ
  • వచ్చే నెలాఖరులోగా కంప్లీట్​ చేయాలని ఆదేశాలు
  • మూడేండ్లకుపైగా ఒకే చోట ఉన్న వారందరికీ ట్రాన్స్​ఫర్​

ముద్ర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంతో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం మొదలుపెట్టింది. ఈ మేరకు శుక్రవారం 5 రాష్ట్రాల సీఎస్‌లు (తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం)కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో మూడేళ్లు దాటిన ప్రభుత్వ అధికారులను బదిలీ చేయాలని ఆదేశించింది. కీలక స్థానాల్లో వున్న పోలీస్, రెవెన్యూ అధికారులను బదిలీ చేయాలని సూచించింది. ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్స్‌పెక్టర్లకు వారి సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వొద్దని సీఈసీ ఆదేశించింది. జూలై 31 లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 

స్థానికంగా పోటీ చేస్తున్న అభ్యర్ధులతో అధికారులకు బంధుత్వాలు లేవని డిక్లరేషన్ తీసుకోవాలని. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఉద్యోగులను ఎన్నికల విధులకు దూరంగా వుంచాలని ఈసీ ఆదేశించింది. గతంలో ఈసీ చర్యలు తీసుకున్న వ్యక్తులను కూడా ఈసారి ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది. 
కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్​ ప్రిన్సిపల్​ సెక్రెటరీ నరేంద్ర ఎన్​. బుటోలియా శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాస్థాయిలో ఎన్నికల విధులను అప్పగించాలని సూచించారు. పోలీస్​ అధికారుల బదిలీల్లో కూడా పలు నిబంధనలను ఉటంకించారు. ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని, మూడేండ్ల నుంచి పని చేస్తున్న అధికారులను ఆయా అసెంబ్లీ స్థానం పరిధిలో కూడా బదిలీ చేయవద్దని సూచించారు.

గతంలో ఎన్నికల విధుల్లో రిమార్కులు ఉన్న వారిని ఎలక్షన్​ విధులకు దూరంగా ఉంచాలని, దీనిపై స్పెషల్​ రిపోర్ట్​ ఇవ్వాలని పేర్కొన్నారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన డిక్లరేషన్​ పత్రాన్ని కూడా ఈ ఉత్తర్వుల్లో పొందుపర్చారు. ఏ ఏ అంశాలపై ఉద్యోగులు, అధికారుల నుంచి డిక్లరేషన్​ తీసుకోవాలనే విషయాలన్నీ ఈసీ ప్ర్స్తావించింది. మిజోరాం ప్రభుత్వ టర్మ్​ ఈ ఏడాది డిసెంబర్​17 నాటికి, చత్తీస్​గఢ్​ టర్మ్​ వచ్చే ఏడాది జనవరి 3 నాటికి, మధ్యప్రదేశ్​ ప్రభుత్వ టర్మ్​ వచ్చే ఏడాది జనవరి 6 నాటికి, రాజస్థాన్​ టర్మ్​ వచ్చే ఏడాది జనవరి 14 నాటికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ టర్మ్​ వచ్చే ఏడాది జనవరి 16న ముగుస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఐదు రాష్ట్రాల సీఎస్​, సీఈఓలకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు పంపించింది. 

ఎట్టకేలకు బదిలీల ప్రక్రియ
రాష్ట్రంలో కొన్నేండ్ల నుంచి బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది. అడపాదడపా కొన్ని ట్రాన్స్​ఫర్స్​ చేస్తున్నా.. కీలక శాఖల్లో ఉద్యోగులు, అధికారులు ఏండ్ల తరబడి ఒకేచోట ఉంటున్నారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్​శాఖల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. పోలీస్​కు అనుబంధమైన ఎక్సైజ్, రవాణా శాఖల్లో కూడా బదిలీలు చేయలేదు. దాదాపు ఏడేండ్ల నుంచి కొంతమంది అధికారులు ఒకేచోట విధుల్లో ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిన ఈసీ.. ముందుగా బదిలీలు చేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్రంలోని 90 శాతం మంది అధికారులు బదిలీ కానున్నారు. అయితే, ప్రభుత్వం ఇటీవల ఐఏఎస్​, ఐపీఎస్​లను ట్రాన్స్​ఫర్​ చేసింది.

Files