మంథని సింగిల్ విండో చైర్మన్ పై అవిశ్వాసం...

మంథని సింగిల్ విండో చైర్మన్ పై అవిశ్వాసం...
  • పెద్దపల్లి జిల్లా సహకార అధికారి  శ్రీమాల కు అవిశ్వాస నోటీసు లు ఇచ్చిన 9 మంది డైరెక్టర్ లు
  • మంథనిలో మళ్లీ వేడెక్కిన అవిశ్వాస రాజకీయం

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ పై డైరెక్టర్లు అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బుధవారం  చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు పెద్దపల్లి జిల్లా సహకార సంఘం అధికారి  శ్రీమాల కు అవిశ్వాస నోటీసు లు పెట్టేందుకు 9 మంది సింగిల్ విండో డైరెక్టర్ లు నోటీసులు ఇచ్చారు. దీంతో మంథని మండలంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీ లో ఉన్న కొత్త శ్రీనివాస్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  శ్రీధర్ బాబు గెలుపొందిన వెంటనే మనసు మార్చుకుని శ్రీధర్ బాబు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత  మొధటి సారి మంథనికి వచ్చిన రోజే ఆయన మంథని చౌరస్తాలో శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు షాక్ ఇచ్చారు.

కొత్త శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య ప్రజా ప్రతినిధులు  శ్రీధర్ బాబు పై ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ శ్రీధర్ బాబు వారిని పట్టించుకోకుండా, కొత్త శ్రీనును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి అందరిని ఆశ్చర్యపరిచారు. దీంతో కొత్త శ్రీను సింగిల్ విండో చైర్మన్ పదవికి డోకా లేదని ఆ యన ధీమాగా ఉన్నాడు. కానీ వారం రోజులు తిరగకముందే సింగల్ విండో డైరెక్టర్లు చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుని ఏకంగా జిల్లా సహకార సంఘం అధికారికి అవిశ్వాస నోటీసులు ఇవ్వడంతో చైర్మన్ పదవికి గండం తప్పదని తెలుస్తుంది.  మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరిస్తాడా... లేదా డైరెక్టర్ ల కోరిక మేరకు అవిశ్వాసం కొనసాగిస్తాడా... అని ఇటు కాంగ్రెస్ పార్టీలో అటు బీఆర్ఎస్ పార్టీలో జోరుగా చర్చ నడుస్తుంది. ఏది ఏమైనప్పటికి ఎన్నికల అనంతరం ఈ అవిశ్వాసం మంథనిలో పెద్ద చర్చగా మారింది.