ఫాక్స్ కాన్ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్..

ఫాక్స్ కాన్ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్..
  • 15న కొంగరలో ఫాక్స్ కాన్ కు భూమి పూజ
  • శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్, ఫాక్స్ కాన్ ప్రతినిధులు

ఇబ్రహీంపట్నం, ముద్ర :అంతర్జాతీయంగా పేరొందిన అదిభట్లలో మరో పరిశ్రమ ఏర్పాటు ముహూర్తం ఫిక్స్ అయింది. ఎలక్ట్రానిక్ దిగ్గజం ఫాక్స్ కాన్ కంపెనీకి ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ వేదికైంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగానే ఈ ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ ఏర్పాటు కాబోతోంది. తైవాన్ ప్రతినిధులతో కలిసి ఫాక్స్కాన్ కంపెనీ భూమిపూజ ఏర్పాట్లను బుధవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, తైవాన్ ప్రతినిధి బ్రెయిన్ కోర్, తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ ప్రతినిధి సుజయ్ తదితరులు పరిశీలించారు. ఈ నెల 15 నిర్వహించే భూమిపూజ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. తైవాన్ పద్ధతుల్లో ప్రత్యేక పూజలతో శంకుస్థాపన నిర్వహిస్తారని సమాచారం. ఈ కార్యక్రమాల్లో మన దేశ, ప్రాంత ప్రజాప్రతినిధులు పాల్గొనబోరని తెలుస్తోంది. అనంతరం నిర్వహించే కార్యక్రమంలో ఇరు దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పూజలు కొనసాగుతాయి. కొంగరకలాన్లోని 300 సర్వే నంబర్ 196 ఏకరా విస్తీర్ణం లో కంపెనీ ఏర్పాటు కానుంది. రూ.3,500 కోట్ల పెట్టబడితో వస్తున్న కంపెనీలో ఆపిల్, స్మార్ట్ ఫోన్ల విడి భాగాలు, ఇతర పరికరాలు తయారుకానున్నాయి.

మరో ఏడాదిలో అందుబాటులోకి..

పనులు ప్రారంభించిన ఏడాదిలోపు ఫాక్స్ కాన్ కంపేనీ అందుబాటులోకి రానుంది. ఈ పరిశ్రమలో ఉత్పత్తులు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే నిర్మాణానికి సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. తైవాన్ ప్రతినిధులే దగ్గరుండి అక్కడి దేశం కాంట్రాక్టర్ల చేత పనులు చేయిస్తున్నారు. ఫాక్స్ కాన్ కంపెనీ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.


ఎలక్ట్రానిక్స్ లో ప్రపంచ దిగ్గజం ఫాక్స్ కాన్

హోన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్ కాన్) ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ. దీనిని 1974లో తైవా న్లో స్థాపించారు. చైనా, జపాన్, వియత్నాం, మలేషియా, చెక్ రిపబ్లిక్, అమెరికాతోపాటు అనేక దేశాల్లో విస్త రించి ఉన్నది. ఆర్ అండ్ డీ, తయారీ కేంద్రాలను స్థాపించింది. కంపెనీ 2019లో ఫోర్బ్స్ టాప్ 100 కంపెనీల్లో 25వ స్థానంలో, 2021లో ఫార్చ్యూన్ గ్లోబల్ 500 ర్యాంకింగ్స్లో 22వ స్థానంలో ఉన్నది. 2021లోనే ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్స్ అవార్డును సొంతం చేసుకొన్నది. క్లారివేట్ టాప్ 100 గ్లోబల్ ఇన్నోవేటర్స్ గత ఐదేండ్లుగా మొదటి ర్యాంకులో నిలుస్తున్నది. ఈ కంపెనీలో మొత్తం 13 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్ విడిభాగాల ఉత్పత్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, డిజిటల్ హెల్త్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ టెక్నా లజీ, అభివృద్ధి తదితర అనేక రంగాల్లో కంపెనీ పెట్టుబడులు పెట్టింది.

ఫాక్స్ కాన్ ఉత్పత్తులు ఇవీ..

ఫాక్స్‌కాన్ వివిధ దేశాల్లోని కంపెనీల కోసం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఫాక్స్‌కాన్ తయారు చేసిన ప్రముఖ ఉత్పత్తులలో బ్లాక్‌బెర్రీ, ఐప్యాడ్,  ఐఫోన్, ఐపాడ్, కిండ్ల్, గేమ్‌క్యూబ్, నోకియా, సోనీ, ప్లేస్టేషన్, గూగుల్ పిక్సెల్, షియమి పరికరాలు, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ సంస్థ మదర్‌బోర్డులపై సీపీయు సాకెట్‌తో సహా, ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న మొత్తం వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌లో 40% ఉత్పత్తి చేస్తున్నాయి. 

ఫాక్స్ కాన్ లో లక్ష మందికి ఉపాధి.. 

తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం ఫాక్స్ కాన్ కొంగరకలాన్ లో ఏర్పాటు కానుంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులలో ప్రపంచంలోనే అగ్రగామిగా వెలుగొందుతున్న ఈ సంస్థ, భారీ స్థాయిలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి యూనిట్ ఈ ప్రాంతంలో ఏర్పాటు కానున్న నేపథ్యంలో సుమారు లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు మంత్రి కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి యూనిట్ మరో ఏర్పాటైతే ఏడాదిలో నిర్మాణాన్ని పూర్తి చేసుకొని అందుబాటులోకి రానుంది.


ఫాక్స్ కాన్ ఏర్పాటుతో అంతర్జాతీయ ఖ్యాతి 
మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే

ఫాక్సాకాన్ సంస్థ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఏర్పాటుతో అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుంది. ఇప్పటికే ఆదిభట్ల ప్రాంతంలో వెలసిన అనేక ఐటి పరిశ్రమలు ఇబ్రహీంపట్నానికి వన్నె తెచ్చాయి. ఈ నేపథ్యంలో మరో ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్ కాన్ ఇక్కడ నెలకొల్పడం శుభపరిణామం. ఆదిభట్ల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 15న ఫాక్స్ కాన్ ఏర్పాటు భూమి పూజ, శంకుస్థాపన చేయనున్నాం