యువతకు భారీగా ఉద్యోగాలు లభించడంతో పాటుగా భూములకు విలువ పెరుగుతాయి..

యువతకు భారీగా ఉద్యోగాలు లభించడంతో పాటుగా భూములకు విలువ పెరుగుతాయి..
  •  జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష 
  •  పోలీసుల భారీ బందో బస్తూ మధ్య ప్రజలకు అవగాహన సదస్సులు
  •  ప్రాణం పోయిన ఫ్యాక్టరీ నిర్మాణానికి ఒప్పు కోమని తెగేసి చెప్పిన ప్రజలు
  •  పలు రకాల ప్రశ్నలను సంధించిన యువకులు, ప్రజాప్రతినిధులు.

వెల్గటూర్, ముద్ర :  స్థంభం పల్లిలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే ఇక్కడి యువతకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయని, ఫ్యాక్టరీ చుట్టు పక్కల గల భూములకు చాలా విలువ వస్తుందని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష అన్నారు.  శుక్రవారం జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలం లోని స్థంభంపల్లి, పాశిగామ గ్రామాలలో పోలీసుల భారీ బందో బస్తూ మధ్య  ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి  ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించారు. క్రిబ్ కో కంపెనీ పుట్టిందే రైతుల కోసమని అన్నారు. ఇక్కడ నిర్మించనున్న ఇథనాల్ ఫ్యాక్టరీలో నూతన టెక్నాలజీని వినియోగిస్తారని, తద్వారా ప్రజలకు ఎటువంటి హాని జరుగదని అన్నారు. ఫ్యాక్టరీలో వినియోగించే నీటిలో ఒక చుక్క నీరు కూడా బయటికి రాదని, రీ సైక్లింగ్ విధానం ద్వారా  నలబై శాతం నీటిని మళ్ళీ వాడుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
 దేశంలో  మూడు ప్రాంతాలు గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని, జగిత్యాల జిల్లా, స్థంభంపల్లిలో  ఫ్యాక్టరీ నిర్మాణాలకు క్రీబ్ కో కంపెనీ  ముందుకు వచ్చిందని అన్నారు. ప్రతి సంవత్సరం రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని  వినియోగించను న్నారు అని తెలిపారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగను కూడా పర్యవేక్షించి, బయటికి వదలడం జరుగుతుందని ఎవ్వరు ఆందోళన చెందవద్దని అన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన టీవీలో నూతనంగా నిర్మించిన ఓ ఫ్యాక్టరీని చూపించే ప్రయత్నం చేయగా ప్రజలు దానిని చూడటానికి ఆసక్తి చూపలేదు. ఆందోళన చేశారు.
స్థంభపల్లి వద్ద  ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రాణాలు పోయిన ఒప్పు కోమని ప్రజలు తేల్చి చెప్పారు. ఈ సందర్బంగా యువకులు, ప్రజా ప్రతినిధులు  అడిగిన పలు రకాల ప్రశ్నలతో అధికారులు, క్రిబ్కో కంపెని ప్రతినిధులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు.
 పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ప్రకారం కిలో లీటర్ ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యానికి 0.1 ఎకరం స్థలం అవసరం కాగా ఇక్కడ నిర్మించే ఫ్యాక్టరీ సామర్థ్యం 250 కిలో లీటర్లు, దీనికి 38 ఎకరాలు స్థలం సరిపోతుంది కానీ 75 ఎకరాల స్థలాన్ని ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.. పర్యావరణ అనుమతి పత్రంలో ఇక్కడి స్థానికులకు ప్రత్యక్ష, పరోక్షంగా187 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కానీ వేలల్లో ఉద్యోగాలు లభిస్తాయని చెప్తూ ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారని అన్నారు. ఈ ప్లాంట్ కు సాంకేతిక డిజైన్లు ఎవరు ఇస్తున్నారని, దానికి గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. ఒక లీటర్ ఇథనాల్ తయారీకి మూడు లీటర్ల నీరు అవసరం ఉంటుందని 40 శాతం నీటిని రీసైక్లింగ్ ద్వారా వాడుకుంటే, 60 శాతం నీటిని ఎక్కడికి వదులుతారని అడిగారు. భూమిలో ఇంకితే  భూగర్భ జలాలు కలుషితం కావా అని అన్నారు. ఒక లీటర్ ఇథ నాయిల్ తయారీకి రూ.80 ఖర్చు అవుతుందని కానీ ప్రభుత్వం రూ.60లకే దానిని కొనుగోలు చేస్తుందని మిగతా నష్టం పన్నుల రూపకంగా ప్రజల పై వేయకుండా ఎలా భరిస్తారని అన్నారు. ప్రభుత్వమే నేరుగా ఎఫ్ సీఐ ద్వారా ధాన్యం కొనుగోలు చేసి, కంపనికి బియ్యం సరఫరా చేస్తుంటే ప్రజలకు  చేకూరే ప్రయోజనం ఏమిటని అదడి గారు. ప్రభుత్వం కంపెనీలకు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ రూపకంగా నిధులను ఇస్తుందని,వాటిని నేరుగా ప్రజలకు సంబందించిన వైద్యం, విద్య పై ఖర్చు చేస్తే బాగుంటుందని అన్నారు.
 ఫ్యాక్టరీ కి వినియోగించే విద్యుత్ ఏ విధంగా తయారు చేస్తారని ప్రశ్నించారు, సోలార్ ద్వారా అయితే అక్కడ ఇంకెంత భూమిని ఆక్రమిస్తారని అడిగారు. బొగ్గును వినియోగిస్తే వాతావరణం కాలుష్యం కాకుండా ఎలా ఉత్పత్తి చేస్తారో  చెప్పాలన్నారు. ఫిర్మెంటేషన్ ప్రక్రియలో యాంటీ బయాటిక్స్ వాడతారని అవి తడి పిప్పిలో చేరి, పొడి పిప్పిగా మారినప్పుడు అందులో ఉండిపోతాయని తద్వారా పశువులకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వస్తుందని అన్నారు. ఆహార ధాన్యాలను ఇంధనానికి తరలిస్తే పేదల ఆకలికి ప్రత్యాన్మాయం ఏమి చూపిస్తానని ప్రశ్నించారు. ఫ్యాక్టరీ మంజూరు కాకా ముందే ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సి ఉండగా అవేమి చేయకుండా, ప్రభుత్వం పక్షాన ఫ్యాక్టరీ కి మద్దతుగా  వచ్చి పోలీసు బందోబస్తు మధ్య  అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటని అడిగారు. ఇప్పటికైనా మా అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని  ప్రభుత్వానికి వివరించి ప్యాక్టరీ నిర్మాణం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. కాగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగ కుండా జిల్లా ఎస్పీ భాస్కర్ ఆధ్వర్యంలో సీఐ  బిల్లా కోటేశ్వర్ ఎస్సై నరేష్  పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఈ  కార్యక్రమం లో ఆర్ డీ వో మాధురి, తహసీల్దార్ రమేష్, ఎంపీడీవో సంజీవరావు కంపెనీ ప్రతి నిధులు కొండూరి రవీందర్ రావు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు