నిర్మల్ లో ఐటి హబ్ ఏర్పాటుకు కృషి

నిర్మల్ లో ఐటి హబ్ ఏర్పాటుకు కృషి

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి 


ముద్ర ప్రతినిధి, నిర్మల్:పోటీ తత్వం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో నిర్మల్ జిల్లా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించడం గర్వకారణమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ లో విద్యాపరంగా మరింత తోడ్పాటు అందించేందుకు జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.


పదో తరగతి పరీక్షల్లో 10 జిపిఎస్ సాధించిన విద్యార్థులకు నిర్మల్ లో సన్మాన కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఇంద్రకరణ్ మాట్లాడుతూ ఈ ఫలితాలు తమ బాధ్యతను మరింత పెంచాయన్నారు. విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఐటీ హబ్ తో పాటు ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఇప్పటికే నిర్మల్ కు 100 సీట్లు సామర్థ్యంతో వైద్య కళాశాల మంజూరు అయిందని, 450 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి ఏర్పాటవుతుందని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అనంతరం 10 జి పి ఎ సాధించిన 267 మంది విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ రాంబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, నిజామాబాద్ కార్మిక శాఖ అధికారి ముత్యంరెడ్డి, పరీక్షల విభాగం సహాయ కమిషనర్ సిద్ధ పద్మ తదితరులు పాల్గొన్నారు.