ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
  • రాష్ట్రంలో అకాల వర్షాలకు సంభవించిన పంట నష్టం గురించి

రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఓవైపు వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయి ప్రభుత్వాల నుంచి ఎటువంటి చేయూత లేని పరిస్థితుల్లో అకాల వర్షం సృష్టించిన బీభత్సం మూగిలే నక్కపై తాడిపండు పడిన చందంగా మారింది. వందల కోట్ల రూపాయల పెట్టుబడి వరద పాలైన పరిస్థితి కళ్లముందు కనిపిస్తుంటే దీనంగా రోదిస్తూ భరించాల్సిన దుస్థితి రైతులకు దాపురించింది.

 పొట్టదశలో ఉన్న వరి సహా ఇతర పంటలుకోసి ఆరబెట్టిన పంటలు ధ్వంసం అవుతుండటంతో ఆరుగాలం పడ్డ శ్రమ బూడిదలో పోసినట్లయింది. తోటల్లో పిందె దశలోని మామిడి పిందెలు రాలిపోవడంతో రైతులూ తలపట్టుకుంటున్నారు. ఈ అకాల వానతో.. అన్నదాతకు అపారనష్టం వాటిల్లింది. ఇంత నష్టం జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మీరేమో ఇవే పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తూ రైతు బతుకులతో చెలగాటం ఆడుతున్నారు. పంట నష్టంపై ప్రభుత్వం నుంచి గానీ, వ్యవసాయ విభాగం నుంచి గానీ ఎటువంటి ప్రకటన రాకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది.

అకాల వర్షాలకు వికారాబాద్, భదాద్రి, ములుగు, భూపాపలపల్లి, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలో రూ.100 కోట్లకుపైగా పంట నష్టం జరిగింది. సంగారెడ్డి జిల్లాలోని 62 గ్రామాల్లో 2633 ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న, మామిడి, ఉల్లి, టమాటా, పుచ్చ తదితర పంటలకు నష్టం వాటిల్లింది. వికారాబాద్ జిల్లాలో 1516 మంది రైతులు 3193 ఎకరాల్లో కోటి రూపాయలకు పైగా విలువైన పంటను కోల్పోయారు. టమాటా, ఉల్లి, వంగ, మామిడి, అరటి, మిర్చి, క్యాబేజీ పంటలు దెబ్బతిన్నాయి.

రంగారెడ్డి జిల్లాలో 1923 ఎకరాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 19 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి నల్గొండ 3130, ములుగు 1921, భూపాలపల్లి జిల్లాలో 913 ఎకరాల్లో పంట నష్టం కలిగింది. ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి పోయింది. ఉమ్మడి మెదక్‌ జిల్లా రాయికోడ్‌ మండలంలో 459 మంది రైతులకు చెందిన 900 ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, శనగ, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. భువనగిరి, బొమ్మలరామారం, యాదగిరి గుట్ట, బీబీనగర్‌, మోత్కూరు, ఆత్మకూరు మండలాల్లో వివిధ పంటలు, మామిడి తోటలకు తీవ్ర నష్టం జరిగింది.

గతంలో ఇలాంటి విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర బృందాలను రప్పించి, క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనా వేయించి, రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకునేవి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ ఎన్నడూ చేపట్టిన దాఖలాలు లేవు. ఇది చాలదన్నట్టు పంటల బీమా పథకాలను సైతం అటకెక్కించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి పంటల బీమా యోజన పథకం కానీ, సవరించిన వాతావరణ పంటల బీమా పథకం కానీ రాష్ట్రంలో అమలు చేయడం లేదు. ఈ పథకాలు అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ప్రీమియం చెల్లించాల్సి వస్తుందన్న దురుద్ధేశంతో పథకానికి మంగళంపాడారు.

ఓవైపు వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డీజిల్ పై వేస్తోన్న పన్నుల భారం పరోక్షంగా వ్యవసాయ పెట్టుబడుల పై ప్రభావం చూపుతోంది. బీమా ప్రీమియం రైతులే చెల్లించుకుకోవాల్సి రావడం, డీజిల్ ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటడం, కూలీ రేట్లు పెరగడంతో ఉత్పాదక ఖర్చులు 20 శాతానికి పైగా అదనంగా పెరిగాయి.

రూ. లక్ష రుణమాఫీ చేస్తామని 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో మీరిచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. దీంతో బ్యాంకుల్లో రైతుల అప్పు అలాగే ఉంది. రైతుబంధు సొమ్ములు ఆ బాకీకి వడ్డీగా జమవుతూనే ఉన్నాయి. రుణం మాఫీ కాకపోవడం, మాఫీ అవుతుందని రైతులు బాకీ చెల్లించకపోవడంతో బ్యాంకులు రైతులకు కొత్త అప్పులు ఇవ్వడం లేదు. దీంతో మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై రైతుల ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది.

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వరదలుఅకాల వర్షాలకు పంట నష్టం జరగడం పరిహారం అందక ఉసూరుమనడం రైతాంగానికి పరిపాటిగా మారింది. రాష్ట్రంలోప్రకృతి విపత్తులు, భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు కుదేలవుతుంటే వారిని ఆదుకునే పథకం ఏదీ కూడా ప్రభుత్వం వద్ద లేకపోవడం అత్యంత దారుణమైన విషయం. ఇది రైతుల పట్ల మీ కపట ప్రేమకు నిదర్శనం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) పథకాన్ని అమలు చేయని రాష్ట్రాలు ప్రత్యామ్నాయ బీమా పథకం ద్వారా రైతులను ఆదుకుంటున్నాయి. అటువంటి వ్యవస్థ కూడా ఈ రాష్ట్రంలో లేకపోవడం దురదృష్టకరం.

ప్రభుత్వాల చేయూత లేకుండా రైతులు స్వయంగా పంటల బీమా తీసుకునే పరిస్థితి లేకపోవటంతో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు భారీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి రైతులకు దాపురిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్‌లో నష్టపోయిన రైతులకు భరోసా కల్పించే విధంగా తగిన నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నా.

డిమాండ్లు...

• అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేయించాలి.

• పంటల బీమా అమలు కాకపోవడానికి మీ నిర్లక్ష్యమే కారణం కాబట్టి... రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలి.

• తదుపరి పంటల నుంచి ప్రభుత్వం ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకాల అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలి.

• తక్షణం రూ.లక్ష రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయాలి.