వేములవాడ బీఆర్ఎస్ టికెట్ల పంచాయతీ

వేములవాడ బీఆర్ఎస్ టికెట్ల పంచాయతీ
  • సంగీత నిలయంలో చెన్నమనేని వర్గీయుల సమావేశం
  • చెన్నమనేని వర్సెస్ చల్మెడ మధ్య  టికెట్​ కోసం పోటా పోటీ

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:  రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ చెన్నమనేని రమేశ్ బాబుకే కేటాయించాలని వేములవాడకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు డిమాండ్ చేశారు. తమ సంపూర్ణ మద్దతు చెన్నమనేనికే అని ప్రకటించారు. సర్వేల్లో చెన్నమనేని గెలుస్తాడని వచ్చిందన్నారు.  సిట్టింగులకే సీట్లు కేటాయిస్తామని  సీఎం కేసీఆర్ హమీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. జర్మనీ నుంచి  వీడీయో కాన్పోరెన్స్ లో చెన్నమనేని వేములవాడ ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. చెన్నమనేని ఎన్నడు లేని విధంగా కాస్తా గళం గట్టిగానే వినిపించినట్లు తెలిసింది. ఎవరికి టికెట్ఇచ్చినా ఇంటింటికి వెళ్లి ఓడిస్తామని శపథం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.  వేములవాడ నియోజకవర్గంలో చెన్నమనేని వర్సెస్ చల్మెడగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. టికెట్ల పంచాయతీ తారా స్థాయికి చేరుకుంది. చల్మెడ వర్గం మండలాల్లో పర్యటిస్తూ గ్రౌండ్ వర్క్ చేస్తుండగా చెన్నమనేని వర్గం టికెట్ విషయంలో ఆత్మరక్షణలో పడిపోయింది. చల్మెడ లక్ష్మీనరసింహరావుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తున్నట్లు తెలియడంతో చెన్నమనేని వర్గం ఆందోళన చెందుతున్నారు. దీంతో వేములవాడ సంగీత నిలయంలో అత్యవసర ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేశారు.  ఇదే సమయంలో వేములవాడ నియజకవర్గంలోని మేడిపల్లి, భీమారం మండలం బీఆర్ఎస్ నాయకులతో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని చల్మడ వర్గం నిర్వహించారు.

  • చెన్నమనేనిని వెంటాడుతున్న పౌరసత్వం కేసు

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబును పౌరసత్వం కేసుతో పాటు ఎన్నికల కేసు కూడా 13 ఏళ్లుగా వెంటాడుతోంది.  కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ వేసిన ఈ కేసు ఇప్పుడు టికెట్ కు  అడ్డు వచ్చి పడింది. బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నా,  మధ్యంతర  కోర్టు తీర్పు వెలువడి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం పోతే.. బీఆర్ఎస్ ఒక ఎమ్మెల్యే సీటు పోతుందని బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచనలో పడినట్లు సమాచారం.దీనికి తోడు వేములవాడ నియోకవర్గంలోని  పలు మండలాల ప్రజాప్రతినిధులు చెన్నమనేనికి వ్యతిరేకంగా పనిచేయడం , పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు కూడా చెన్నమనేనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామంటూ ప్రకటనలు చేయడంతో బీఆర్ఎస్ అధిష్టానం పునారాలోచన చేస్తోందని తెలిసింది.