కాంగ్రెస్ తోనే పేదల జీవితాల్లో వెలుగులు..

కాంగ్రెస్ తోనే పేదల జీవితాల్లో వెలుగులు..
  • తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతుంది..
  • మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దు..
  • బీఆర్ఎస్, బిజెపి పార్టీలు కుమ్మక్కైయ్యాయి.. 
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించేది మేమే..
  • అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తాం..
  • కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ..
  • ములుగు జిల్లాలో మొదలైన విజయభేరి యాత్ర..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:కాంగ్రెస్ తోనే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, తెలంగాణలో అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయభేరి యాత్ర ను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బుధవారం సాయంత్రం పర్యటించారు. ముందుగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామంజపురం శివారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణలో అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతుందన్నారు. బీఆర్ఎస్ చేస్తున్న మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దని, బీఆర్ఎస్, బిజెపి పార్టీలు కుమ్మక్కయ్యాయని తెలిపారు. ప్రస్తుతం జరుగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని హామి ఇచ్చారు. 2004లో అధికారంలో ఉన్నపుడు రాజకీయ లాభ నష్టాలను పక్కనబెట్టి కేవలం ఈ ప్రాంత ప్రజల బాగుకోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత దళితులను సీఎం మోసం చేశాడని,ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశాడని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షకోట్లు దోచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో 25 లక్షల రూపాయల వరకు ఉచిత హెల్త్ పాలసీ తీసుకొచ్చి అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఛత్తీస్ గఢ్ లో రైతులకు రుణ మాఫీ చేశామని, రైతులకు మద్ధతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 

కర్ణాటకలో ఐదు గ్యారంటీల హామీ ఇచ్చామని,  అధికారంలోకి రాగానే అమలు చేస్తున్నామని వివరించారు. ఏమాట ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందని తెలియజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పోడు చేసుకున్న రైతులకు భూములను ఇప్పిస్తామని, గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తామని హామి ఇచ్చారు.తెలంగాణలో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే పోటీ ఉందని, బీఆర్ఎస్ గెలవాలని బీజేపీ కోరుకుంటోందని,బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ ఒకటేనని చెప్పారు. పార్లమెంటులో ప్రతి అంశంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలుకుతోందని, కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంఒక్కటాయ్యాయని తెలిపారు. విపక్ష నేతలందరిపైనా కేసులు పెట్టినా... కేసీఆర్ పై ఒక్కకేసు పెట్టలేదో అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.దేశంలో బీజేపీపై మేము యుద్ధం చేస్తున్నామని, అవినీతి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి,కాంగ్రెస్ కు మద్దతు తెలపాలని రాహుల్ గాంధీ కోరారు.

మాఫియాను రక్షించేందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది..
 ప్రియాంక గాంధీ..

మాఫియాను రక్షించేందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంకగాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్రం శ్యాండ్, ల్యాండ్, వైన్స్, మైన్స్ మాఫియాతో నిండిపోయిందని, వారికి రక్షణగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నారు.రంగారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల భూములను బీఆర్ఎస్ పెద్దలు లాక్కున్నారని, బంగారు తెలంగాణ అని ప్రజలను మోసం చేసి, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో సామాజిక న్యాయం లేకుండా పోయిందని, ముగ్గురు మంత్రులు ఒకే కుటుంబానికి చెందిన ఉన్నారని ఆరోపించారు. మంత్రి వర్గంలో బీసీలకు అన్యాయం జరిగినా పట్టించుకునేవారే లేకుండా పోయారని విమర్శించారు. తన దోస్తులైన ప్రైవేట్ శక్తులకు ఈ దేశాన్ని అమ్మేస్తున్నారని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.తెలంగాణ పుణ్య భూమి అని,వీరులను అందించిన భూమి ఇది అని, న్యాయం కోసం కొట్లాడిన నేల అని ఉద్భోధించారు. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారిని ఇప్పటికీ స్మరించుకుంటున్నామని చెప్పారు.మీకలలు సాకారం అవుతాయని, ఉద్యోగాలు వస్తాయని మీరు బీఆర్ఎస్ ను నమ్మారని, అందరి కలలు సాకారం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, రాజకీయంగా ఇబ్బంది ఉంటుందని తెలిసినా సోనియాగాంధీ తెలంగాణపై ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని వివరించారు.తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు ఆలోచించి, చేశారు. ముందు చూపుతో తెలంగాణ రాష్టాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. కానీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, ఉద్యోగ నియామక ప్రక్రియలో అక్రమాలు జరుతుతున్నాయని, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న యువతి క్యారెక్టర్ పై నింద వేశారని విమర్శించారు. ఇప్పటికీ నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గల్ఫ్ సెల్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.ఆదివాసీలు, గిరిజనులు అంటే ఇందిరాగాంధీకి చాలా ఇష్టమని, ఆదివాసీల హక్కులను ఈ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శలు గుప్పించారు. మేము పోడు రైతులకు పట్టాలు ఇస్తే. బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపివేసిందని గుర్తు చేశారు. ఏరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా  ఇచ్చిన హామీలను అమలు చేయడం జరుగుతుందన్నారు. 

తొమ్మిదేళ్ల పాలనలో పెరిగిన అవినీతి, అక్రమాలు.
రేవంత్ రెడ్డి కామెంట్స్..

బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు విపరీతంగా పెరిగిపోయాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో అత్యాచారాలు, అరాచకాలు, ఆత్మహత్యలు, ఆధిపత్యమే కనిపిస్తుందని, రాష్ట్రాన్ని రక్షించేందుకు సోనియా గాంధీ కుటుంబం మన ముందుకు వచ్చిందని తెలిపారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది. కానీ ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని, అందుకే సోనియా గాంధీ ఆరు గ్యారంటీలు ఇచ్చారని తెలిపారు. పేద ఆడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు, తులం బంగారం ఇస్తామని, ములుగులో సీతక్కను, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణరావును గెలిపించాలని ఈ ప్రాంత ప్రజలకు రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు థాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కి, శ్రీధర్ బాబు, సీతక్క, గండ్ర సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.