కేంద్రం పథకాలను ప్రజలకు వివరిస్తాం 

కేంద్రం పథకాలను ప్రజలకు వివరిస్తాం 
  • బీఆర్ఎస్ ఎన్నికల హామీలపై కలెక్టరేట్ ను ముట్టడిస్తాం
  • బీజేపీ ఇంఛార్జి, ఉడిపి ఎమ్మెల్యే సురేష్ శెట్టి

ముద్ర ప్రతినిధి, మెదక్:-కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరిస్తూనే బీఆర్ఎస్  సర్కార్ వైఫల్యాలపై  పోరాడుతామని మెదక్ నియోజకవర్గ ఇంఛార్జి, ఉడిపి ఎమ్మెల్యే సురేష్ శెట్టి పేర్కొన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మరోసారి మెదక్ ప్రజలను సీఎం మోసం చేశారని,  గత ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలనే మరోమారు చెప్పారన్నారు. దేశంలో ఎక్కడపోయినా కేంద్ర పథకాలు కనిపిస్తాయని తెలంగాణలో కనిపించడం లేదన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూనే కేంద్ర పథకాలు ప్రజలకు వివరిస్తామన్నారు. జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పర్యటన పోలీస్ పహారా మధ్య సాగిందన్నారు. కేసీఆర్ స్పీచ్ కొత్త సీసాలో పాత సారల ఉందని ఎద్దేవాచేశారు. మంత్రి హరీష్ రావు జిల్లాకు పట్టిన శని  అని, జిల్లాలోని ఆఫీసులను, విద్యాసంస్థలను సిద్దిపేటకు తరలించుకుపోతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని నమ్మె స్థితిలో ప్రజలు లేరన్నారు. హామీల అమలు కోసం కొత్త కలెక్టరేట్ ను ముట్టడిస్తామన్నారు. నిజాంపేట జడ్పిటిసి పంజా విజయ్ కుమార్ మాట్లాడుతూ 2014, 2018 ఎన్నికల్లోనే మెదక్ కు రింగు రోడ్డు ఇస్తున్నామని చెప్పారు.. మళ్ళీ అదే చెబుతున్నారన్నారు. మంత్రి హరీష్ రావు మెదక్ కు రింగురోడ్డు ఇచ్చినట్లు చెప్పారని ఎక్కడ ఉందో చూపించాలని డిమాండ్ చేశారు.

మెదక్ కు మెడికల్ కాలేజి మంజూరైనట్లు చెబుతున్నారని, 300 పడకలు లేని హాస్పిటల్ కు  ఏ విదంగా వస్తుందో చెప్పాలన్నారు. జిల్లా కేంద్రంలో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. ఘనపురం ఆనకట్ట ఎత్తు ఎంత పెంచారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఏడుపాయలకు రూ 100 కోట్లు ఉత్తమాటేనని ఎద్దేవాచేశారు. రామయంపేట రెవెన్యూ డివిజన్ ఉద్యమాల ఫలితమేనని, సీఎం ప్రకటనను తాము స్వాగతిస్తున్నామన్నారు. రామయంపేట డిగ్రీ కళాశాలకు వెంటనే ప్రొసీడింగ్ ఇవ్వాలన్నారు. విద్యలో మెదక్ అట్టడుగులో ఉండటం బాధాకరమన్నారు.రాబోయే కాలంలో కేసీఆర్ వైఫల్యాలపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.మెదక్ లో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి రాజశేఖర్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డి, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్, సీనియర్ నాయకులు సుభాష్ గౌడ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వీణ, బిజెవైఎం జిల్లా అధ్యక్షులు ఉదయ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు.