డాక్టర్ ప్రీతి కేసుపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు?

 డాక్టర్ ప్రీతి కేసుపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు?

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు మహిళలంటే గౌరవం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ  విమర్శలు గుప్పించారు.  సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తన గొప్పతనాన్ని చాటుకునేందుకే దిశా కేసులో ఎన్‌కౌంటర్ చేయించారన్నారు. కేఎంసీ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పనిచేయలేదంటే నేరాన్ని తప్పించుకునేందుకే పగడ్భందీగా ప్లాన్ చేసారని అర్థమవుతుందని తెలిపారు. ఆడపిల్లలను చదువు కోసం హాస్టల్స్‌కు పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారన్నారు. మరోసారి అధికారంలోకి రావాలని ఆలోచన తప్పితే మహిళలపై జరుగుతున్న దారుణాలపై కేసీఆర్ కు ఆలోచన లేదని బీజేపీ నేత మండిపడ్డారు.  

కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఒత్తిడికి గురై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ప్రీతి హత్య కేసు లో ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ప్రీతీ కేసును ప్రభుత్వం  నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తే బీజేపీ  చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆపడానికి ముఖ్యమంత్రిగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో కేసీఆర్  స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రీతి ఘటనపై పూర్తి నిజానిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని డీకే అరుణ  పేర్కొన్నారు.