భవిష్యత్ తరాలకు గొప్ప నగరాన్ని అందించడమే లక్ష్యంగా

భవిష్యత్ తరాలకు గొప్ప నగరాన్ని అందించడమే లక్ష్యంగా

* భవిష్యత్ తరాల కోసం పని చేస్తున్న

* హరిత హారంలో వైద్యుల భాగస్వామ్యం అభినందనీయం

* చెట్లు బావి తరానికి ఆస్తి

* నివాసయోగ్యమైన నగరం కరీంనగర్ 

* రాష్ట్ర  మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : కాంక్రీట్ జంగిల్ గా మారిన కరీంనగర్ ను హరితవనంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామనీ, తాను ఓట్ల కోసం పని చేయడం లేదని, భవిష్యత్ తరాలకు గొప్ప నగరాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నానని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి  గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండంలోని బొమ్మకల్ శివారులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్థలంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై ఐఎంఏ ప్రతినిథులతో కలిసి మొక్కలు నాటరు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు నేను ఓట్ల కోసం పనిచేయడం లేదని, భావితరాలకు గొప్పనగరాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్ననన్నారు.

ఆధునీక పోకడలతో పర్యావరణంలో సమతుల్యం లోపించి రుతువులు గతితప్పి వర్షాకాలంలో ఎండలు ఎండాకాలంలో వర్షాలు కురుస్తున్నాయన్నారు. మన చిన్ననాడు ముసురు పడితే వారం రోజుల పాటు ఉండేదని నేటి తరానికి ముసురు అంటే ఏంటో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ సమతుల్యం లోపించిన పర్యావరణాన్ని చక్కదిద్దేందుకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. సిఎం కెసిఆర్ ఆకాంక్షల మేరకు వైద్యులు సామాజిక బాధ్యతగా హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

కేంద్రం హరితహారం పై అవార్డులిస్తే  ప్రతి అవార్డు తెలంగాణకే దక్కుతుందన్నారు. గత 70 సంవత్సరాల స్వతంత్ర పాలనలో ప్రభుత్వాలు మారాయి. సిఎం, పిఎంలు వచ్చారు పోయారే కానీ కరీంనగర్ ప్రమాణాలు మాత్రం మారలేదన్న మంత్రి గతపాలకులకు కరీంనగర్ అభివృద్ది కోసం రూపాయి వెచ్చించేందుకు కూడా మనస్సు రాలేదన్నారు. కానీ స్వయం పాలనలో  సిఎం కెసిఆర్ సహకారంతో వందలాది కోట్లతో కరీంనగరాన్ని అభివృద్ది చేస్తున్నామని, హైదరాబాద్ తర్వాత 2వ గొప్పనగరంగా కరీంనగర్ రూపుదిద్దు కుంటుందన్నారు.గతంలో వివిధ కారణాలతో రోగులు చనిపోతే మృతి చెందిన వారి బంధువులు అసుపత్రుల పై దాడులు చేసే సంస్కృతి ఉండేదని కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అలాంటి పరిస్థితులు లేకుండా పోయాయన్నారు. మేము తీసుకున్న చర్యలకు నగర వాసుల జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు.

నన్ను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నానని ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలైన మానేర్ రివర్ ఫ్రంట్... కేబుల్ బ్రిడ్జీ... మెడికల్ కాలేజీ... తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిర్మిస్తున్నామన్నారు. కరీంనగర్ అంటే చరిత్ర కలిగిన నగరమని ఇక్కడికి ఏం ప్రాంతం వారు వచ్చిన శాంతి భద్రతల మధ్య నివసించేందుకు అనుకూలంగా తీర్చిదిద్దామన్నారు. కరీంనగర్ అభివృద్దిలో వైద్యులు సహకారమందించాలన్న మంత్రి గంగుల వారికి ప్రభుత్వం తరపున  కావల్సిన సహాయ సహకారాలను అందిస్తామన్నారు.