ప్రభుత్వంతో సమరానికి సై అంటున్న ఏపీ ఉద్యోగులు 

ప్రభుత్వంతో సమరానికి సై అంటున్న ఏపీ ఉద్యోగులు 

విశాఖపట్నం: ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తూనే ఉంది. సమస్యలను పరిష్కరించాలని, సీపీఎస్‌ ను అమలు చేయాలంటూ చాలా రోజులుగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఉద్యమబాట పట్టాయి. ఈనెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నట్లు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు  ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యలను నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు.అందుకు నిరసనగా ఈనెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేస్తామని ప్రకటించారు. ఈ నెల 9 నుంచి ఏప్రిల్ 3 వరకు దశల వారీగా ఉద్యమం చేస్తామన్నారు. అప్పటికీ స్పందించకపోతే ఏప్రిల్ 5న జరిగే కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ పై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.  తమ ఉద్యమానికి ఏపీ సీపీఎస్ఏ  కూడా మద్దతు ప్రకటించిందన్నారు. జగన్ ప్రభుత్వం  ఉద్యోగ వర్గాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టబధ్ధంగా రావాల్సినవి‌‌, తాము దాచుకున్న డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీ ఇచ్చి మరిచిపోయిన అంశాలను గుర్తుచేయడానికే తమ ఉద్యమం అని స్పష్టం చేశారు. డీఏ అరియర్స్ లక్షలాది రూపాయల ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు‌న్నారు. సీపీఎస్‌ను వారం రోజుల్లో చేస్తామన్నారు ఏమైందని ప్రశ్నించారు. ఏ హామీ ఇవ్వని రాష్ట్రాలు సీపీఎస్ రద్దు చేశాయని గుర్తు చేశారు. రాజస్ధాన్, ఛత్తీస్‌ఘడ్‌లలో పాత పెన్షన్ విధానం అమలు సమీక్షించడానికి తీసుకు వెళ్లి మళ్లీ ఎందుకు మాటమారుస్తున్నారని నిలదీశారు. ‘‘రాజకీయ నాయకులు ఎందుకు పెన్షన్ తీసుకుంటున్నారు.. మీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసుకోగలరా?.. ప్రజాప్రతినిధులు జీతాలు వారే నిర్ణయించుకుంటారు.. వారికి పీఆర్సీలతో సంబంధం లేదా?’’ అంటూ ప్రశ్నలు కురిపించారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని ఎందుకు చేయలేదని అడిగారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేశారన్నారు. ప్రతిఒక్క ఉద్యోగి ఉద్యమంలో పాల్గొనాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.