చరిత్రను మార్చి చరిత్ర హీనులు కావద్దు

చరిత్రను మార్చి చరిత్ర హీనులు కావద్దు
  • ఓట్ల కోసం నీచ రాజకీయాలు తగవు
  • భారత దేశ భద్రత బిజెపి కే సాధ్యం
  • బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కొన్ని వర్గాల ఓట్లకోసం చరిత్రను మార్చి ప్రజలను ఏమార్చే యత్నాలను తిప్పికొట్టాలని, రాబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి హ్యాట్రిక్ విజయం అందించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ పిలుపునిచ్చారు. బిజెపి చేపట్టిన విజయ సంకల్ప యాత్ర లో భాగంగా బుధవారం ఆయన నిర్మల్ కు వచ్చారు.ఈ సందర్భంగా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన రాంజీ గోండు సహా వెయ్యి మందిని ఉరి తీసిన ఉరుల మర్రి చెట్టు పడిన ప్రాంతంలో స్మృతి వనం నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ  గిరిజన పోరాట యోధుడు రాంజీగోండు సహా వెయ్యి మంది ప్రాణత్యాగం చేసిన  స్మారక ప్రాంతాన్ని ఒక వర్గం వారి సమాధికి కేటాయించటం చరిత్రను మరుగు పరచటమేనని అన్నారు. ఒక వర్గం ఓట్ల కోసం ఆదివాసీల చరిత్రను తెరమరుగు చేసే కుట్ర చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఇలాగే చరిత్రను తెర మరుగు చేయాలనుకున్న బీఆర్ఎస్ సర్కార్ ను కనుమరుగు చేసిన చరిత్ర తెలంగాణా ప్రాంత ప్రజలదని ఆయన అన్నారు.

ఒక వర్గం కొమ్ము కాసేందుకు వెయ్యి ఉరుల మర్రి స్మారక ప్రాంతాన్ని మరో చోటుకు మార్చాలనుకోవడం దుర్మార్గ చర్య అని దుయ్యబట్టారు. 
గతంలో వెయ్యి ఉరుల మర్రి ఉన్న  చోట రాంజీ గోండు స్పూర్తి కేంద్రం ఏర్పాటు కోసం బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తో కలిసి  బండి సంజయ్ భూమి పూజ చేశారు.వచ్చే ఏడాది నాటికి ఈ ప్రాంతాన్ని  రాంజీగోండు స్పూర్తి కేంద్రంగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని బండి సంజయ్ అన్నారు. రాంజీగోండు స్మారక చిహ్న ప్రాంతాన్ని వివాదాస్పదం చేస్తే ఖబర్డార్ అని హెచ్చరించారు.  వెయ్యి ఉరుల మర్రి చరిత్రను మతం కోణంలో చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు మౌనం వహించటాన్ని ఆయన తప్పు పట్టారు. దీనిని వివాదాస్పదం చేస్తే అది కాంగ్రెస్ కే నష్టమన్నారు. ఓట్ల కోసం వివాదాస్పదం చేయాలను కుంటే బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ చరిత్ర కూడా తెరమరుగు కాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, నిర్మల్ బిజెపి అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి,రావుల రాం నాథ్, అల్జాపూర్ శ్రీనివాస్, అయ్యన్న గారి భూమయ్య, డాక్టర్ మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.