పసుపు బోర్డుపై అసత్య ప్రచారం వద్దు

పసుపు బోర్డుపై అసత్య ప్రచారం వద్దు
  • కాంగ్రెస్ నేతలకు గెజిట్ పత్రాన్ని చూపెట్టిన శ్రావణి
  • 40 ఏళ్లలో జగిత్యాల ఏం అభివృద్ధి చెందిందో చెప్పాలి
  • ఎంపీగా ఓడితేనే మంత్రి అవుతారు అప్పుడైన  అభివృద్ధి చేయండి
  • ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి హితవు


ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పసుపు బోర్డుపై అసత్య ప్రచారం వద్దని, రైతులను మభ్యపెట్టి మోసం చేయకండని, పసుపు రైతు కళ్ళలో ఆనందం ఉంటే మీ కళ్ళలో ఎందుకు నిప్పులు చేరుగుతున్నారని నిజామబాద్ కాంగ్రెస్ పార్టి అభ్యర్థి, ఎమ్మెల్సి జీవన్ రెడ్డిని ఉద్దేసించి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి అన్నారు. జగిత్యాలలోని కమల నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రావణి మాట్లాడుతూ అసత్య ప్రచారం మాని  పసుపు బోర్డు గెజిట్ పత్రాన్ని కాంగ్రెస్ నాయకులూ చూడండని గెజిట్ పత్రాన్ని చూపించారు. మీ హయాంలో చెరుకు , పసుపు, మామిడి రైతులు నష్టపోయారని రైతులను మభ్యపెట్టి మోసం చేయకండని పేర్కొన్నారు.  అధికారం వచ్చాక మీ ఇంటి ముందు రోడ్డు వేయించుకున్నారు.. కానీ జగిత్యాల పట్టణ ప్రధాన యావర్ రోడ్డు సంగతి మర్చిపోయారని గుర్తు చేశారు.

నేను చైర్మన్ గా ఉన్నప్పుడు యావార్ రోడ్డు 100 ఫీట్లకు గెజిట్ తీసుకువచ్చాము 40 ఏళ్ల రాజకీయంలో మీరు ఏం చేశారని ప్రశ్నించారు. జగిత్యాల గంజాయికి గేట్ వేగా మారిందని, ఆడపిల్లలు ఇంటికి రాత్రి సమయంలో క్షేమంగా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పీ ఎఫ్ ఐకి  జగిత్యాల అడ్డగా మారిందని, పెంచి పోషించింది మీరని.. దేశంలో ఎక్కడ బ్లాస్టింగ్ జరిగిన దాని మూలాలు జగిత్యాలలో ఉంటున్నాయని అన్నారు. బీడీ కార్మికులకు మీరు 100 రోజుల హామీలో ఇస్తా అన్న 4వేల రూపాయల  పెన్షన్ ఇచ్చిన తర్వాత  ఈ ఎస్ ఐ హాస్పిటల్స్ గురించి మాట్లాడండని శ్రావణి సూచించారు.

బిఆర్ఎస్ హయాంలో మోసలి కన్నీరు కార్చిన కాంగ్రెస్ ఇప్పుడు రైతులకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా అర్వింద్ 2019 లో ఎంపీగా గెలుపొందిన తర్వాత నాలుగున్నర ఏళ్ల కాలంలో ఏకంగా  ఆరు ఆర్వోబీలు , ఒక ఆర్ యూ బి మొత్తంగా 7 మంజూరు చేయించారని అన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం  కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలి, మీరు చదువుకున్న మేధావులు మీరు అదుపుతప్పితే మేము నోరు తెరవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. మోడీ సైనికుడు అరవింద్  ను గెలిపిస్తే కేంద్రమంత్రి అయి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని అందుకు ప్రజలు ఆశీర్వదించాలని శ్రావణి కోరారు. ఈ  సమావేశంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, జగిత్యాల పట్టణ మహిళ మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దెల గంగరాజం, పుష్ప రెడ్డి, తిరుపతి, పురేల్ల ప్రశాంత్  తదితరులు పాల్గొన్నారు.