పార్టీ గెలుపుకోసం కృషి చేస్తే...అసత్య ప్రచారాలా

పార్టీ గెలుపుకోసం కృషి చేస్తే...అసత్య ప్రచారాలా

షాబాద్, ముద్ర: పార్టీ గెలుపుకోసం కృషి చేస్తే...ఓడించారంటూ విషప్రచారం చేస్తారా అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ... తనకు నియోజకవర్గ స్థాయిలో ఎలాంటి బాధ్యతలు అప్పగించకున్నా, షాబాద్ మండలం లో పార్టీకి 1890 మెజారిటీ సాధించి పెట్టామని అన్నారు. తనపై అసత్య ప్రచారం చేసి, జనవరి 20న షోకోజు నోటీసులు ఇస్తే, దానికి 25వ తేదినే సమాధానం ఇచ్చామన్నారు. పార్టీ తన సమాధానంతో సంతృప్తి చెందినా, తనపై గిట్టని వారు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి అనుచరుడిగా ఆయన సీఎం కావాలని ఆకాంక్షించే నేను, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయేందుకు ఎందుకు ప్రచారం చేస్తానని ప్రశ్నిచారు. అసత్య ప్రచారాలు చేసే వారు , తాను పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు ఏం చేసానో , సాక్షాలతో నిరూపించాలని అడిగారు.

1998లో మాజీమంత్రి ఇంద్రారెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీలో తాను చేరినట్లు గుర్తు చేశారు. తెలంగాణా ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ చేరి, 2014లో ఆ పార్టీ అధికారంలో ఉన్నా, పదవులకు ఆశపడకుండా, రేవంత్ రెడ్డి తో పాటు, కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు. శాసనసభ ఎన్నికలకు పది రోజుల ముందు పార్టీ గెలుపు కోసం మద్దూర్ సర్పంచి నరేందరెడ్డి, సోలిపేట, హైతాబాద్ మాజీ సర్పంచిలు జనార్దనరెడ్డి, ఖాజామియా తో పాటు, శంకరపల్లి మండల పీఏసీఎస్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, చేవెళ్ల మండల న్యాయవాది యాదిరెడ్డి లాంటి వారిని తమ అనుచరులతో పార్టీలో ఎందుకు చేరిపిస్తానని ప్రశ్నించారు. ఇలాంటి చవకబారు చేష్టలతో పార్టీకి నష్టం చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, నేతలు జనార్దన్ రెడ్డి, చేవెళ్ల స్వామి, రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సంజీవ రెడ్డి, ఆంజనేయులు, మాధవరెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్యం పాల్గొన్నారు.