మన ఆరోగ్యం మన చేతుల్లోనే..

మన ఆరోగ్యం మన చేతుల్లోనే..
  • వారానికి 3 సార్లు డ్రై డే చేపట్టాలి...
  • పారిశుద్ధ్యకార్యక్రమాలు నిరంతరం చేపట్టాలి..
  • కలెక్టర్  అనురాగ్ జయంతి..

 ముద్ర ప్రతినిధి,  రాజన్న సిరిసిల్ల: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, జాగ్రత్తలు పాటిస్తూ కాపాడుకోవాలని,వారానికి 3 సార్లు డ్రై డే చేపట్టడం ద్వారా దోమలు వృద్ధి చెందకుండా , దోమ కాటు  రాకుండా నియంత్రించవచ్చని, నిర్లక్ష్యం చేస్తే  దోమలు కుట్టి డెంగ్యూ వస్తే చాలా కష్టమని, ఆర్థికంగా నష్టపోవడంతో పాటు, ప్రాణహాని ఉంటుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శనివారం ఉదయం వేములవాడ పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు. మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తో కలిసి 20 వ వార్డ్ లోనిగాంధీ నగర్ నుండి టెంపుల్ వరకు, టెంపుల్ నుండి గాజుల బజార్ వరకు కాలినడకన తిరుగుతూ... పారిశుద్ధ్యం, నాలాలు, డ్రైనేజీ లు,స్వీపింగ్ ఆక్టివిటీస్,పబ్లిక్ టాయిలెట్ పరిశుభ్రతను  మరియు కోరుట్ల బస్టాండ్ సమీపంలో ఇటీవలే నిర్మాణం పూర్తి చేసిన పుట్ పాత్ లను పరిశీలించారు.

స్థానిక ప్రజలతో మాట్లాడాతూ మిషన్ భగీరథ నీరు వస్తుందా? చెత్త సేకరణ వాహనం రోజూ మీ ఇంటికి వస్తుందా? మీ ఇంట్లో ఎవరికైనా జ్వరాలు ఉన్నాయా,అంటూ ప్రజలను ప్రశ్నించారు.
భగీరథ నీరు క్రమ తప్పకుండా వస్తుందని,చెత్త సేకరణ వాహనం రోజూ ఇంటికి వస్తుందని ప్రజలు తెలిపారు. జ్వరాలు ఎవ్వరికీ లేవని సమాధానం ఇచ్చారు.ఇండ్లలో మంచి నీరు నిల్వకుండా చూడాలనీ,
మంచి నీటిలోనే డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతాయని అన్నారు.

వారంలో  ప్రతి మంగళ వారం, శుక్రవారం, ఆదివారం పట్టణంలోని ప్రతి  ఇంట్లో ఉన్న నీటి నిల్వలు లేకుండా ఫ్రైడే, డ్రైడే పాటించాలని ప్రజలకు సూచించారు.డ్రై డే లో భాగంగా ప్రతి మంగళ,  శుక్రవారం, ఆదివారం మెప్మా రిసోర్స్ పర్సన్, ఏఎన్ఎంలు  ఆశా లు ఇంటింటికి తిరుగుతూ, పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం, కీటక జనిత వ్యాధుల వల్ల కలిగే నష్టాలను వివరించి చైతన్యం చేయాలన్నారు. ఇండ్లలో మంచి నీరు నిల్వ ఉంటే వాటిని పారబోయాలన్నారు. రోడ్ల కు ఇరు వైపులా డ్రైన్ లలో నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందకుండా ద్రావణం పిచికారి చేయాలన్నారు. ఉపయోగంలోనీ బావుల్లో నీరు ఉంటే ఆయిల్ బాల్ లు వేయాలన్నారు. ఒకవేళ ఎవరికైనా  డెంగ్యూ పాజిటివ్ వచ్చినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు సమాచారం అందించాలని, వారి ఇంటిలోని అందరికి, చుట్టుపక్కల వారికి పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, లార్వాలను గుర్తించి నిర్మూలించాలని ఆయన తెలిపారు. లార్వా ఉన్న చోట యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, నీటి నిల్వలు లేకుండా చేసుకోవాలని, ఆయిల్ బాల్స్ వేయించాలని, దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోవాలని అన్నారు 

రెండు వారాలకు ఒక్కసారైనా ప్రతి ఇంటినీ సందర్శించేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. వర్షాకాలం ముగిసే వరకూ ఇదే విధంగా చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే రెండు నెలల పాటు పారిశుద్ధ్య చర్యలు అత్యంత కీలకమని, మురుగుకాల్వల్లో నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రం చేయించాలని, ఖాళీ స్థలాలు, మురుగు నీరు పేరుకుపోయిన ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.