జి–20కి ఢిల్లీ రెడీ!

జి–20కి ఢిల్లీ రెడీ!
  • 40 ఏళ్ల తరువాత భారత్​లో శిఖరాగ్ర సదస్సు 
  • ఒకరోజు ముందుగా వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
  • నేరుగా మోడీ నివాసానికి.. బైడెన్​కు విందు ఇచ్చిన ప్రధాని
  • కీలక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు
  • సతీమణితో దక్షతా మూర్తితో వచ్చిన బ్రిటన్​ప్రధాని రిషి సునాక్​
  • తనను ‘భారతదేశ అల్లుడు’గా వ్యవహరిస్తారని బ్రిటన్​లో వ్యాఖ్య

 
భారత్​లో 40 ఏళ్ల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జి–20 శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని న్యూ ఢిల్లీ ముస్తాబైంది. వివిధ దేశాధినేతల రాకతో హస్తిన నగరం కళకళలాడుతోంది. విభిన్న సంస్కృతుల సమ్మేళనమైన భారతదేశంలో జరుగుతున్న జి–20 సదస్సుకు ఎంతో ప్రత్యేకత ఉంది. వసుదైక కుటుంబంగా భావించి అందరికీ సాదర స్వాగతం పలుకుతోంది. శని, ఆదివారాలు జరగనున్న జి–20 సదస్సుకు ఢిల్లీ పెళ్లికూతురిలా ముస్తాబైంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నగరాన్ని ముస్తాబు చేశారు.


జి–20 ఖర్చు రూ.4,254 కోట్లు

ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జి–20కి కేంద్రం రూ.4254 కోట్ల ఖర్చు చేసింది. రక్షణ, రోడ్లు, ఫుట్​పాత్​లు, లైటింగ్, బోర్డులు తదితరాల కోసం ఖర్చయినట్లు ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. పోలీస్​శాఖకు రూ.340 కోట్లు, నగర మున్సిపాలిటీకి రూ.60 కోట్లు, ప్రజా విభాగానికి రూ.45 కోట్లు, రోడ్ల మరమ్మతులకు రూ.26 కోట్లు, ఢిల్లీ అభివృద్ధికి రూ.18 కోట్లు, అటవీశాఖకు రూ.16 కోట్లు, నగర విభాగానికి రూ.5 కోట్లు, వ్యాపార, వాణిజ్య శాఖ(అతిథులు, విందులు, సమావేశాల్లో ఏర్పాట్లు, వాహనాలు, ప్రత్యేక భద్రత)కు రూ.3,600 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది.

న్యూఢిల్లీ: మెరుగైన ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు ఢిల్లీ జి–20 వేదికగా పరిష్కారం చూపబోతోంది. జి–20 సదస్సులో ఒకప్పుడు గ్లోబల్ ఎకానమీపైనే దృష్టి సారింవారు. కానీ.. ఇటీవల కాలంలో ఆర్థిక వ్యవస్థతోపాటు ట్రేడింగ్, సుస్థిరాభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయం, ఎనర్జీ, పర్యావరణం, వాతావరణ మార్పులపైనా ప్రధానంగా సదస్సులో దేశాధినేతలు ఫోకస్ పెడుతున్నారు. భారత్‌లోనూ సరికొత్త అంశాలు అజెండాలో ఉండబోతున్నాయి. గతానికి భిన్నంగా 80 నగరాల్లో భాగస్వామ్య దేశాల ప్రతినిధులతో వివిధ రంగాలపై సమావేశాలు నిర్వహించి పలు కీలక నిర్ణయాలు, ఒప్పందాలు చేసుకోనున్నాయి.

ఒకరోజు ముందుగానే బైడెన్..

అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జి–20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఒకరోజు ముందుగానే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జో బైడెన్​భారత్​కు రావడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ.. జో బైడెన్​కు తన నివాసంలో ఆతిథ్యాన్ని అందించారు. ఢిల్లీ ఎయిర్​పోర్ట్​నుంచి బైడెన్​నేరుగా మోడీ నివాసానికి చేరుకున్నారు. ఇప్పటివరకూ ఏ దేశాధ్యక్షుడికి కూడా ప్రధాని మోడీ నివాసంలో విందు ఏర్పాటు చేయలేదు. తొలిసారిగా బైడెన్​కే ఆ గౌరవం దక్కినట్లయింది. విందు అనంతరం జి–20లో జరగనున్న చర్చలపై వారు ముచ్చటించారు. ఈ చర్చల్లో భారత్​లో జెట్ ఇంజన్ల తయారీపై ఒప్పందం, ఎంక్యూ9బీ డ్రోన్ల కొనుగోలు, పౌర, అణు బాధ్యత, వాణిజ్యం తదితరాలపై ఒప్పందాలపై చర్చించారు. సమావేశానికి ఒకరోజు ముందే అధ్యక్షుడు రావడంతో మరికొన్ని అంశాల చర్చలకు సమయాభావం ఎదురవుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా మరోమారు ఆయా అంశాలపై జనవరిలో ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా స్పష్టం చేశారు. 

జనవరి 26న క్వాడ్ లీడర్స్​సమ్మిట్?

వచ్చే ఏడాది జనవరి 26న ‘క్వాడ్​ లీడర్స్​సమ్మిట్’ను ఏర్పాటు చేయాలని భారత్​ఆలోచిస్తుంది. కాగా జి–20 సమావేశంలో ఇనిషియేటివన్ ఆన్​క్రిటికల్​అండ్​ఎమర్జింగ్ టెక్నాలజీ సహకారంపై కూడా ఇరుదేశాధినేతలు సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ – రష్యా పరిస్థితులు, అదే సమయంలో అమెరికా – చైనా సంబంధాలు, భారత్​– చైనా సంబంధాలు, నియంత్రణ రేఖలు, ఉగ్రవాదం, పర్యావరణం, ‘పౌర అణుబాధ్యత’ భారత్​– యూఎస్​ అణు ఒప్పందంపై కూడా చర్చలు జరిగినట్లుగా అధికారులు పేర్కొన్నారు. కాగా ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓలో భారత్ పై ఉన్న ఆరు కేసులను అమెరికా ఉపసంహరించుకుంది. అదే సమయంలో కొన్ని ఉత్పత్తులపై సుంకాలను తగ్గించేందుకు భారత్ అంగీకరించింది. దీంతో వాణిజ్య సంబంధాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫోరమ్ ట్రేడ్​లో భారత్​చేరాలని జో బైడెన్​ కోరే అవకాశం కూడా ఉంది. 

భార్యతో వచ్చిన ‘భారతదేశ అల్లుడు’ రిషి సునాక్..

మరోవైపు జి–20 శిఖరాగ్ర సదస్సు నిమిత్తం బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ భారత్‌కు చేరుకున్నారు. తన సతీమణి అక్షతామూర్తితో కలిసి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి ఆశ్వినీ చౌబే, భారత్‌లో బ్రిటన్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఎలిస్‌ సహా ఇతర సీనియర్‌ దౌత్యవేత్తలు ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు బ్రిటన్‌లో బయలుదేరే ముందు రిషి సునాక్‌ అక్కడి మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు వెళ్లడం తనకు చాలా ప్రత్యేకమని అన్నారు. తనని 'భారతదేశ అల్లుడు'గా వ్యవహరిస్తుండడాన్ని ఆయన సరదాగా గుర్తుచేసుకున్నారు. ఆప్యాయతతోనే తనని అలా పిలుస్తున్నారని ఆశిస్తున్నానన్నారు. భారత్‌ తన మనసుకు చాలా దగ్గరి దేశమని సునాక్‌ వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం, అంతర్జాతీయ సంబంధాల నిర్మాణం వంటి స్పష్టమైన లక్ష్యాలతో తాను భారత పర్యటనకు వెళుతున్నానని చెప్పారు.