సిద్దిపేట జిల్లాకు అత్యధికంగా ధూప, దీప,నైవేద్య స్కీమ్

సిద్దిపేట జిల్లాకు అత్యధికంగా ధూప, దీప,నైవేద్య స్కీమ్
  • ఆలయాలకు నిలయం.. సిద్దిపేట.
  • ముద్ర ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్

ముద్ర ప్రతినిధి:సిద్దిపేట:-దేవాలయాలకు నిలయమైన సిద్దిపేట జిల్లాలో ధూప,దీప నైవేద్య పథకానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్ తెలిపారు. బుధవారం నాడు సిద్దిపేటలో జరిగిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహినిపుర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముద్రా ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు.ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట, మెదక్,సంగారెడ్డి లకు మొదటి విడతలో 218 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకాన్ని ప్రభుత్వం మంజూరు చేసిందని అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్ చెప్పారు.ఈ విడతలో ఉమ్మడి మెదక్ జిల్లా లోని 404 దేవాలయాలకు ప్రభుత్వం ధూప, దీప  నైవేద్య పథకాన్ని మంజూరు చేసిందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చూపిన ప్రత్యేక చొరవ వల్ల సిద్దిపేట జిల్లాలోని 171 ఆలయాలకు, సంగారెడ్డి జిల్లాలోని 140 ఆలయాలకు, మెదక్ జిల్లాలోని 93 దేవాలయాలకు ధూప, దీప, నైవేద్య పథకం మంజూరు అయిందని ఆయన వివరించారు. ఆలయాల్లో నిత్య పూజ, అభిషేకాలను సమయానుసారంగా నిర్వహించి భగవంతునికి నైవేద్యం సమర్పించాలని ఆయన అర్చకులను కోరారు. అప్పుడే ప్రజలు ప్రాంతాలన్నీ సుభిక్షంగా ఉంటాయని ఆయన తెలిపారు. ఇంకొన్ని చోట్ల పురాతన ఆలయాలు అలక్షానికి గురవుతున్నాయన్న విషయం ముద్ర ప్రతినిధి ఏసీ దృష్టికి తీసుకురాగా వాటిని స్థానిక అధికారులు పరిశీలించాలని ఆదేశించారు.