దోస్తుల మధ్య దూరం?

దోస్తుల మధ్య దూరం?
  • ఒంటరిగా పోటీకి మజ్లిస్, వామపక్షాలు రెడీ!
  • కొత్త జిల్లాలకు విస్తరించాలని చూస్తున్న మజ్లిస్
  • పట్టున్న అన్ని నియోజకవర్గాల్లో పోటీకీ రెడీ అవుతున్న వామపక్షాలు
  • ఒంటరిగా పవర్​లోకి రావాలనే యోచనలో బీఆర్ఎస్

ముద్ర, తెలంగాణ బ్యూరో : నిన్నమొన్నటి వరకు వారంతా రాజకీయంగా  మిత్రులు. పరస్పరం సహకరించుకున్నారు. కొన్ని సందర్భాల్లో బహిరంగంగా..  మరికొన్ని సందర్భాల్లో లోపాయికారి ఒప్పందాలను చేసుకుని రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. అయితే ఇదంతా ఇక గతంగా మారనుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మిత్రులంతా.. వైరివర్గాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ పరిస్థితి బీఆర్ఎస్, మజ్లిస్, వామపక్షాల మధ్య కనిపిస్తోంది. అధికార బీఆర్ఎస్ కు ఇప్పటి వరకు ఆ రెండు పార్టీలు సంపూర్ణ సహకారం అందించాయి. రాజకీయంగా, ప్రభుత్వ పరంగా గులాబీ పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కంటికి రెప్పలా చూసుకున్నాయి. ఇందుకు ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం వారికి పూర్తి స్థాయిలో చేయూతనందించింది. దీంతో పరస్పరం భావసారూప్యం గల మూడు పార్టీలు చాలాకాలం పాటు స్నేహితులుగా కొనసాగారు. అయితే ఇటీవల మిత్ర పక్షాలు రాజకీయంగా ప్రయోజనం పొందే లక్ష్యంతో పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి వారు ఒంటిరిగానే బరిలోకి తమ సత్తా చాటుకోవాలని యత్నిస్తున్నాయి.

సీట్ల సంఖ్య పెంచుకునే యోచనలో.. 

ఇందులో మజ్లిస్ పార్టీ ముందు వరసలో ఉంది. కేవలం పాతబస్తీకే పరిమితమైన ఈ పార్టీ.. వచ్చే ఎన్నికల్లో కొత్త జిల్లాలపై కన్నేసింది. ఆయా జిల్లాలో పోటీ చేసి తమ సీట్ల సంఖ్యను పెంచుకోవాలని యత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు పాతబస్తీ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న మజ్లిస్.. వచ్చే ఎన్నికల్లో ఆ సంఖ్యను కనీసం 15 స్థానాలను పెంచుకోవాలని భావిస్తోంది. ఈ విషయాన్ని నిండు శాసనసభలో ఆ పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ కూడా చెప్పారు. ప్రధానంగా మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్న జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, ముషీరాబాద్, అంబర్ పేట్, బోధన్, మహబూబ్ నగర్, మక్తల్, నారాయణ్ పేట్, కరీంనగర్, నిర్మల్, భైంసాతోపాటు మరిన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. పాతబస్తీని దాటి కొత్త జిల్లాలో మజ్లిస్ పోటీ చేయాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకీ దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పార్టీ నేతల నుంచి ఇదే రకమైన ఒత్తిడి పెరుగుతుండడంతో మజ్లిస్ అగ్రనేతలైన అసదుద్దీన్, అక్బరుద్దీన్ కూడా పార్టీని విస్తరించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పైగా వచ్చే ఎన్నికల్లో 15 నుంచి 20 స్థానాల్లో విజయం సాధించి  ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని మజ్లిస్ పార్టీ భావిస్తోంది. దీంతో మొదటి సారిగా పాతబస్తీతో పాటు మజ్లిస్  పార్టీ ఇతర జిల్లాల్లోనే పచ్చ జెండాను ఎగరవేయాలని ఉవ్విళ్లూరుతోంది. నిజామాబాద్ జిల్లాలో సోమవారం అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు సైతం ఇందుకు ఊతమిస్తున్నాయి. 

బీఆర్ఎస్​తో పొత్తు ఉండదు..

ఇటీవల బోదన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కు..  ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురు మజ్లిస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో పరామర్శకు ఆయన నిజామాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌తో సహకారం విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌తో పొత్తు మాటే ఉండదన్నారు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు విషయం తర్వాత ఆలోచిస్తామని.. ముందు మా క్రికెట్ బ్యాటింగ్ మేము ఆడతాము. మా స్కోర్ మేము చూసుకుంటామన్నారు. ఆపై ఎవరిని అవుట్ చేయాలనేది ఆలోచిస్తామని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ ఆగడాలు రోజురోజుకు మితిమిరిపోతున్నాయని, వారిని కట్టడి చేయకపోతే ముందుముందు మరిన్ని తలనొప్పులు వచ్చే ప్రమాదముందని అధికార పార్టీలోని  పలువురు నేతలు బహిరంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఆ పార్టీతో అంటకాగడం వల్ల ఇతర వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశముందని కొందరు నేతలు పరోక్షంగా కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారని గులాబీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీతో కొంత దూరం పాటిస్తేనే మంచిదన్న అభిప్రాయంతో గులాబీ బాస్ ఉన్నట్లుగా తెలుస్తోంది.