ఎండిపోతున్న పైర్లు

ఎండిపోతున్న పైర్లు

విద్యుత్‌ కోతలు రైతులకు కష్టాల వెతలను తెచ్చి పెడుతున్నాయి. వేళాపాలా లేని కోతలతో బోరుబావుల కింద సాగు చేసిన పంటలు ఎడిపోతున్నాయి. చేతికొచ్చిన పంటలు అందకుండా పోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. గత కొంతకాలంగా సత్యసాయి జిల్లా గుడిబండ మండలంలో నెలకొన్న ఈ విద్యుత్‌ సమస్యలు రైతుల జీవితాలను అప్పుల్లోకి నెట్టేస్తున్నాయి. గుడిబండ మండల వ్యాప్తంగా రాళ్లపల్లి, శంకరగల్లు, ఎస్‌.రాయాపురం, కొంకల్లు, కెఎన్‌.పల్లి, కరికెర, మందలపల్లి, సిసి.గిరి తదితర పంచాయతీల పరిధిలో వేలాది ఎకరాల్లో వేరుశనగ, మొక్కజొన్న, మిర్చి, వరి, వక్క, తమలపాకు, అరటి, మల్బరీ తదితర పంటలను రైతులు సాగు చేశారు. బోరుబావుల కింద సాగువుతున్న ఈ పంటలకు నీటి తడులు అత్యవసరం. నిబంధనల మేరకు వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్‌ ఇవ్వాల్సి ఉండగా మండలంలో ఆరు గంటలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఎప్పుడు వస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది. సమయ పాలన లేకపోవడంతో కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో రైతులకు తెలియడం లేదు. అవసరమైన సమయంలో పంటలకు నీటితడులు అందక అవి ఎండిపోతున్నాయి.

ఖరీఫ్‌ సీజన్లో పెట్టిన పంటలు వర్షాభావంతో చేతికందకుండా పోయాయి. దీంతో రైతులు రబీలో బోరుబావుల కింద సాగు చేసిన పంటలపై దృష్టి సారించారు. ఈ సీజన్‌లో అయినా పంటలు చేతికందుతాయని భావించిన రైతులకు విద్యుత్‌ కోతలతో నిరాశే మిగులుతోంది. నీళ్లులేక కళ్లేదుటే పంటలు ఎండిపోతున్నా ఏవిూ చేయలేని స్థితిలో రైతులు ఉన్నారు. గుడిబండకు పక్కన ఉన్న మండలాల్లో తొమ్మిది గంటలు విద్యుత్‌ ఇస్తుండగా ఇక్కడ మాత్రం ఆరు గంటలు కూడా ఇవ్వడం లేదు. ఈ విషయంపై పలుమార్లు రైతులు విద్యుత్‌ అధికారులను సంప్రదించినా ప్రయోజనం లేకుండా ఉంది. విద్యుత్‌ అధికారులు స్పందించి తొమ్మిది గంటల విద్యుత్‌ ఇవ్వకుంటే ఈ సారి పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గుడిబండ మండలంలో విద్యుత్‌ కోత వాస్తవమే. ఆరు గంటలు మాత్రమే విద్యుత్‌ సరఫరా అవుతోంది. మండల కేంద్రంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ లేని కారణంగా పక్కన ఉన్న మూడు సబ్‌స్టేషన్ల ద్వారా మండలానికి విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. దీంతో విద్యుత్‌ లోడ్‌ ఎక్కువగా ఉంది. ఈ కారణంగా గుడిబండలో తొమ్మిది గంటల విద్యుత్‌ సరఫరాలో లోపం ఉంది. ఈ సమస్య పరిష్కారానికి అదనంగా మరో ఆరు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. మొదటి దశలో రాళ్లపల్లి, హిరేతూర్పి గ్రామాలకు సబ్‌స్టేషన్లు మంజూరు అయ్యాయి. ఆ పనులు త్వరలోనే ప్రారంభించి ఆ పంచాయతీ పరిధిలోని రైతులకు తొమ్మిది గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తాం. మిగిలిన గ్రామాల్లో కూడా త్వరలోనే విద్యుత్‌ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.