కొత్త సీఎస్ ఎవరు?

కొత్త సీఎస్ ఎవరు?

ముద్ర, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులవుతారనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లనున్నారు. వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లనున్నట్టు ఆయన ముఖ్యమంత్రికి నివేదించినట్టు సమాచారం. ఈమేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ కు తెలియపరిచినట్టు తెలుస్తోంది. ఈ రోజు సీఎస్ జవహర్ రెడ్డి లీవ్ లెటర్ ను జీఏడీ కి పంపించనున్నట్టు తెలుస్తోంది. సీఎస్ సెలవుమీద వెళ్లగానే కొత్త అధికారిని ఆ పోస్టులో నియమించాల్సివుంది. ఈ స్థానంలోకి కె.విజయానంద్ ను నియమిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం 1987 బ్యాచ్ ఐఎఎస్ అధికారి నీరబ్ కుమార్ ను టీడీపీ అధినేత ప్రధాన కార్యదర్శిగా నియమించనున్నారని తెలుస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో నీరబ్ కుమార్ పలు కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన అనుభవం వుంది. ఈయన ప్రస్తుతం అటవీ, పర్యావరణ,సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గా పని చేస్తున్నారు. వీరి తరువాత సీనియారిటీ వరుసలో అనంతరాములు, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, రజత్ భార్గవ్… పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది.