ప్రచార హోరు!

ప్రచార హోరు!
  • నామినేషన్లకు ముందే ప్రజల్లోకి ప్రధాన పార్టీలు
  • గ్రామాల్లో హోరెత్తిస్తున్న అభ్యర్థులు

ముద్ర‌,హుజూరాబాద్ :  నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. నామినేషన్లకు ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారాలు సాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందు నుంచే పలు పార్టీ అభ్యర్థులు జనాల్లోకి వెళ్లగా షెడ్యూల్‌ విడుదల తర్వాత మరింత స్పీడ్‌ పెంచారు. నామినేషన్ల దాఖలుకు ఇంకా సమయం ఉండగానే ముందస్తుగా గ్రామాలన్నీ జల్లెడ పడుతున్నారు. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్ట‌గా, బీజేపీ త‌ర‌పున బ‌రిలో దిగిన ఈట‌ల రాజేంద‌ర్ ఇటు హుజూరాబాద్‌, అటు గ‌జ్వేల్‌లో ప్ర‌చారం సాగిస్తున్నారు. జ‌మ్మికుంట మండ‌లంలో ప్ర‌చారాన్ని ప్రారంభించ‌గా, ఆమె స‌తీమ‌ణి ఈట‌ల జ‌మున ప్ర‌చారం సాగిస్తున్నారు. 

అభ్యర్థుల ఖరారుతో జోరు..

నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ధానంగా కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ పార్టీ అభ్య‌ర్థుల ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేస్తున్నారు. బీజేపీ ప్ర‌చారం నెమ్మ‌దించ‌డంతో మిగిలిన ప్ర‌ధాన‌పార్టీల అభ్య‌ర్థులు ప్ర‌చారంలో దూకుడు పెంచుతున్నారు. బీఆర్‌ఎస్‌ తరపున పాడి కౌశిక్‌రెడ్డి, కాంగ్రెస్ త‌ర‌పున వొడితెల ప్ర‌ణ‌వ్‌, బీజేపీ నుంచి ఈట‌ల రాజేంద‌ర్‌లు బ‌రిలో ఉన్నారు. 

నామినేషన్‌లోగాఎక్కువ గ్రామాలు

ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ఆయా పార్టీల అభ్యర్థులు టెన్షన్‌ పడుతున్నారు. ఈ నెల 3 నుంచి నామినేష‌న్‌లు ప్రారంభం కావ‌డంతో నామినేష‌న్ దాఖ‌లు చేసేలోగా ప్ర‌చారాన్ని హోరెత్తించాల‌ని అభ్య‌ర్థులు దూకుడు పెంచారు. నామినేషన్ల దాఖలుకు జన సమీకరణ ఏర్పాట్లతో పాటు ముఖ్య నేతల పర్యటనలు ఉంటే వాటి ఏర్పాట్లలో నిమగ్నం అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఓటర్లకు తాయిలాల పంపిణీపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నామినేషన్లకు ముందు వీలైనన్ని ఎక్కువ గ్రామాలను పూర్తి చేస్తే ఆ తర్వాత ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. 

పగటిపూట ప్రచారం..రాత్రిళ్లు ప్రణాళికలు

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు సమయాన్ని వృథా చేసుకోవడం లేదు. ఓ వైపు పగటిపూట అంతా గ్రామాల్లో ప్రచార పర్వాల్లోనే మునిగిపోతుండగా రాత్రిళ్లు ఇళ్లకు చేరగానే తీసుకోవాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై అర్థరాత్రి వరకు కసరత్తుల్లో మునిగిపోతున్నారు. రాత్రిళ్లు ఒంటి గంట వరకు ముఖ్య నాయకులతో సమాలోచనల్లో మునిగి తేలుతున్నారు. పగటిపూట జరిగిన ప్రచారం తీరు, ప్రత్యర్థి పార్టీల విమర్శలను తిప్పికొట్టడం, సొంత పార్టీలో ఆసమ్మతులను చల్లబరచడం, ప్రత్యర్థి పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించడం వంటి అంశాలపై తర్జనభర్జన పడుతున్నారు. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు ఎలా వేయాలన్న అంశాలపై ముఖ్యనేతలతో సమాలోచనలు చేస్తున్నారు.