ఆరోగ్యానికి మంచి ఆహారంతో పాటు వ్యాయామం తప్పనిసరి - జిల్లా జడ్జి డి రాజేష్ బాబు

ఆరోగ్యానికి మంచి ఆహారంతో పాటు వ్యాయామం తప్పనిసరి - జిల్లా జడ్జి డి రాజేష్ బాబు

నాగర్ కర్నూల్ జిల్లా ముద్ర ప్రతినిధి: ప్రస్తుత జీవన శైలిలో ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి మంచి ఆహారంతో పాటు ప్రతి రోజూ వ్యాయామం చేయడం తప్పనిసరి చేసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు అన్నారు.
 ఈనెల 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా మంగళవారం ఉదయం నాగర్ కర్నూల్ పట్టణంలోని కేసరి సముద్రం ట్యాంకుబండ్ పై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్యం పై అవగాహన కల్పించేందుకు 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు 2కే రన్  ప్రారంభించి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....

మంచి ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించడానికి వైద్య ఆరోగ్యశాఖ ప్రజలకు మంచి ఆహారాన్ని తీసుకుంటు, ప్రతిరోజు కొంత సమయాన్ని యోగ వ్యాయామాలపై నిర్వహించేలా విస్తృతమైన అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ, ఆసక్తి, బాధ్యత, సంకల్పం కలిగి మంచి జీవన శైలితో సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవాలని జిల్లా న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రతి రోజూ నడకతో మొదలై యోగా, ఆట, పాటలు ద్వారా జీవనశైలిలో మార్పు వస్తే గుండెజబ్బులు, పక్షపాతం, బిపి, షుగర్‌ వంటి జబ్బులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రతిరోజు తీసుకునే ఆహారంలో మార్పుల ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందుచున్నారు. అందుకు ప్రతి ఒక్కరు చిరుధాన్యాలను స్వీకరించాలని కోరారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ఆశ  ఏఎన్ఎం ల సేవలను ఆయన గుర్తుచేసి అభినందించారు.

జిల్లా సీనియర్ ప్రిన్సిపల్ జడ్జి సబిత మాట్లాడుతూ....

దేవుడు ప్రసాదించిన ప్రకృతిని దూరం చేసుకోవడం వల్లనే ప్రస్తుత సమాజంలో ఆరోగ్య సమస్యలు అధికమవుతున్నాయని ఆమె అన్నారు. ప్రతిరోజు ఉదయం సూర్యరశ్మి శరీరానికి తగలడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయన్నారు. ప్రతి ఒక్కరూ ఏసీ రూములను వదిలి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉదయాన్నే వ్యాయామాలు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార నియమాల్లో మార్పులు చేసుకోవడం ఆవశ్యకత ప్రస్తుత సమాజంలో చాలా అవసరం ఉందన్నారు. జంక్ ఫుడ్ ల నుంచి పిల్లలను దూరం చేయడం చిరుధాన్యాలతో రుచికరమైన ఆహార పదార్థాలను అలవాటు చేయడం ద్వారా ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని తెలిపారు. డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్, హాజరైన వైద్యులు పలు రకాల ఆరోగ్య సమస్యలు వాటి వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు.

గుండెపోటు వస్తే ప్రథమ చికిత్స ఎలా నిర్వహించాలో డెమో చేసి చూపించారు. గుండె కొట్టుకోవడం నిలిచిపోతే వెంటనే సి పి ఆర్ ను ఎలా నిర్వహించాలో  వైద్యులు డెమో తో ప్రదర్శించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సబిత, డిఎంహెచ్వో సుధాకర్ లాల్, డిఫెన్స్ లీగల్ సర్వీసెస్ న్యాయవాది మధుసూదన్ రావు, బార్ అసోసియేషన్ జర్నల్ సెక్రెటరీ ఏ. పర్వత్ రెడ్డి, కోర్టు సిబ్బంది కేశవరెడ్డి, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యావాదులు వైద్యులు తదితరులు పాల్గొన్నారు.