గాంధీజీ స్ఫూర్తిగా తెలంగాణాలో పాలన - మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

గాంధీజీ స్ఫూర్తిగా తెలంగాణాలో పాలన - మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గ్రామ స్వరాజ్యమే దేశ సౌభాగ్యం అనే గాంధీజీ మాటలే స్ఫూర్తిగా తమ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణా దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగుతోందని అన్నారు. రైతే రాజు అనే నానుడిని నిజం చేస్తూ రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా కోట్లాది నిధులను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.

కుటుంబంలోని సభ్యులందరికి తగిన పథకాలు రూపొందిస్తూ తెలంగాణా దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. సామాన్యుడి సంక్షేమమే పరమావధిగా తమ నాయకుడు పాలన కొనసాగిస్తున్నారని అన్నారు.జరుగుతున్న అభివృద్ధి చూసి పొరుగు రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ రాంబాబు,జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా నాయక్, జడ్పీటిసి లు, మండలాధ్యక్షులు పాల్గొన్నారు.