కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫి

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫి
  • మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం
  • మెదక్ ఆత్మగౌరవ యాత్రలో డిసిసి అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫి చేస్తామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. బుధవారం మెదక్ ఆత్మగౌరవ యాత్రను నియోజక వర్గంలోని నార్సింగి మండలం జప్తిశివనూర్ గ్రామంలో ప్రారంభించారు.అమరవీరుల సాక్షిగా ఆత్మబలిదానాలు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఘోషను చూడలేక తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ర్ట తల్లి సోనియా గాంధీ ఆనాడు తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటిస్తే.. నేటి పాలకులు తెలంగాణలో రాజ్యమేలడమే కాకుండా అవినీతి కూపంలో కూరుకుపోయారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా  గ్రామంలో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల మాట్లాడుతూ పదేండ్ల ప్రత్యేక రాష్ర్టంలో ఏ ఊర్ల చూసినా కనీసం రోడ్లు కూడాలేని దుస్థితి నెలకొందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెంచిన గ్యాస్ ధరలను తగ్గిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే వంట గ్యాస్ ను అందిస్తామని హామీనిచ్చారు. రైతులు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులను ఎవ్వరు కూడా కట్టవద్దని, అధికారంలోకి రాగానే ఏకకాలంలో ఒకేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫి కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కూడా కల్పిస్తూ, ఎస్సి, ఎస్టిలకు తిరిగి సబ్ ప్లాన్ లు తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు రమణ, శ్రీనివాస్, గౌస్, కేశవులు, యాదగిరి,సిద్దిరాములు, ఉదయ్, సుధాకర్ తదితరులు పాల్గోన్నారు.