దొర బిడ్డకు.. కూలి బిడ్డతో యుద్ధం

దొర బిడ్డకు.. కూలి బిడ్డతో యుద్ధం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : ఈసారి నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నిక దొర బిడ్డకు కూలి బిడ్డకు జరుగుతున్న యుద్ధమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని 2,13వ వార్డుల్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఓటు అభ్యర్థించారు. అనంతరం నాగర్ కర్నూల్ మండలం, తూడుకుర్తి బొందలపల్లి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మేలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదులుకుంటే మనం చాలా బాధపడుతామన్నారు. గత 60 ఏళ్లుగా అధికారం ఇస్తే కాంగ్రేస్ వారు మనకు ఏమి చేసారో ఒకసారి ఆలోచించాలన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కంప్లయింట్ ఇచ్చి రైతు బంధు సహాయాన్ని ఆపిందన్నారు. వారి మోసపూరిత హామీలు, గ్యారెంటీలు నమ్మితే మళ్ళీ మన బతుకులు ఆగమవుతాయన్నారు. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం వుంటే ఎంతైనా చేస్తుందన్నారు. నాగర్ కర్నూలుకు మెడికల్ కళాశాల తెచ్చానన్నారు. అంబేడ్కర్ సాక్షిగా చెపుతున్న ఈసారి గెలిపిస్తే ఇంజనీరింగ్ కళాశాల తెస్తానని హామీ ఇచ్చారు. మళ్ళీ ఈసారి కారు గుర్తుకు ఓటు వేసి మూడోసారి భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయి అన్నారు. ప్రతి ఇంటికి 5 లక్షల కేసీఆర్ బీమా, సౌభాగ్య లక్ష్మి కింద అర్హులైన మహిళలకు నెలకు 3వేల రూపాయల జీవన భృతి, ఆసరా పెన్షన్ల కింద వృద్ధులకు 5016/- రూపాయలు, వికలాంగులకు 6016/- రూపాయలు అందజేస్తామన్నారు.

రైతులకు రైతు బంధు కింద ఎకరాకు 16 వేలకు పెంచుతామన్నారు. 400 వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తాంమన్నారు. అన్నపూర్ణ పథకం కింద తెల్ల రేషన్ కార్డు వున్న వారికి సన్నబియ్యం అందజేస్తామన్నారు. ఆరోగ్య రక్ష కింద ఆరోగ్యశ్రీ పరిమితి 15 లక్షల రూపాయలు పెంచుతామని చెప్పారు. మహిళా సంఘాలకు పక్కా భవనాలు నిర్మిస్తామని, అగ్రవర్ణ పేదలకు గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు. తన ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా ఇంకా సామాజిక కార్యక్రమాలు చేపడుతానన్నారు. అందరూ కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మళ్ళీ సేవ చేసే భాగ్యం కల్పించాలన్నారు. రైతులకు, రైతు బంధు, రుణ మాఫీ, 24 గంటల కరెంటు, రైతు బీమా, సరైన సమయంలో ఎరువులు, సాగు నీళ్ళు అందజేస్తున్న సీఎం కెసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా వుండాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాల రూపు రేఖలు మారినవి అని అన్నారు, ఒకప్పుడు గ్రామాల్లో కరెంట్ వుండేది కాదు, తగానికే నీళ్ళు వుండేవి కాదు, పశువులకు గడ్డి కూడా దొరకపోయేదని, ఎప్పుడూ ఎక్కడా ఏ గ్రామంలో చూసిన పచ్చని పంట పొలాలతో, నిండుగా ఉన్న చెరువులలో కళకళలాడుతున్నాయన్నారు. తను ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత గ్రామాల్లో పెద్దఎత్తున సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించానన్నారు. ఒకప్పుడు రోడ్లు లేక బజార్లలో వరి నాట్లు వేసి నిరసన తెలిపే వారన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మళ్ళీ మనకు కష్టాలు వస్తాయన్నారు.

కాంగ్రెస్ పార్టీలో 30 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు వున్నారని ఎద్దేవా చేశారు. అదే బీఆరెస్ పార్టీలో అయితే ఒకే ఒక్క సీఎం కెసీఆర్అని అన్నారు. మూడు గంటల కరెంట్ ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా..? లేక 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న బీఆరెస్ పార్టీ కి ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంటే 200 పించన్ ఇచ్చే వాళ్ళని, ఇప్పుడు 4వేళా పెన్షన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారంలో వున్న రాష్ట్రాల్లో 4వేల పెన్షన్ అమలు చేసి తెలంగాణ ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్టే కారు చీకట్లు కమ్ముకుంటాయన్నారు. ఇప్పుడెప్పుడే వెలుగులు వచ్చిన మన జీవితాల్లో మళ్ళీ చీకట్లు వస్తాయన్నారు. తన ట్రస్ట్ అధ్వర్యంలో సామూహిక వివాహాలు, ఉచిత డ్రైవింగ్ లైసెన్స్, మర్రన్న క్యాంటీన్ వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.