ఆత్మీయ సమ్మేళనాలతో ఆకట్టుకుంటూ..

ఆత్మీయ సమ్మేళనాలతో ఆకట్టుకుంటూ..
  • మరణించినవారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ.....
  • పెళ్ళి, ఇతర వేడుకలకు హాజరై ఆశీర్వదిస్తూ...
  • ఓట్ల కోసం కోటిపాట్లు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: కూటికోసం కోటి విద్యలు అన్న నానుడినిఆ కొంచెం మార్చుకుని ఓట్ల కోసం కోటి పాట్లు అని మార్చుకోవచ్చునేమో ప్రస్తుత ఎన్నికల ప్రచార పదనిసలు గమనిస్తుంటే. అసెంబ్లీ ఎన్నికల పుణ్యమాని ఓటర్లకు, వారి కుటుంబ సభ్యులకు మంచి జరిగినా, చెడు జరిగినా పరామర్శలు, ఆశీర్వచనాలు పుల్ గా లభిస్తున్నాయి. వారెపరో, ఈయనెవరో ఎవరికీ తెలియకున్నా ఫర్వాలేదు. ఫలానా చోట, ఫలానా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడని తెలిస్తే చాలు రాజకీయ నాయకులుపరామర్శలు, పలకరింపులకు వెంటనే వాలిపోతున్నారు. ఛస్తే ఎన్నికల కాలంలోనే చావాలి అన్నట్టుగా పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరేని కుటుంబంలో అనారోగ్యకారణాలు, వృద్ధాప్యంతో చనిపోతే చాలు వెంటనే అక్కడ వాలిపోతున్నారు. తమతో పాటు బంధువులు ఎందరో వచ్చారన్నట్టుగా మంది, మార్బలంతో దండలు పట్టుకుని వచ్చి శ్రద్ధాంజలి ఘటించి చనిపోయినవారికి నివాళులర్పిస్తున్నారు. పనిలో పనిగా ఇంకా కొంచెం దగ్గరివారైతే, బాగా తెలిసినవారైతే దగ్గరుండి అంత్యక్రియల వరకు ఉంటున్నారు. చనిపోయినవారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ, ఓదారుస్తూ, బాధ పడవద్దని నచ్చచెబుతూ, కాలమహిమను ఎవరేమీ చేయలేమని, కర్మఫలాన్ని తప్పక అనుభవించాల్సిందే నంటూ గీతాసారాన్ని, వేదాంతధోరణితో బోధిస్తూ, ఉపదేశం అందిస్తూ అమ్మయ్య ఇగ చాలు ఈ కుటుంబం ఓట్లు మనకు వచ్చినట్టే అని మనసులో అనుకుంటు వెళ్ళిపోవడం ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో చనిపోయినవారి కుటుంబాలలో జరుగుతున్న సగ్నసత్యం. చావులలో పరామర్శలు, పలకరింపులు చిత్ర విచిత్రంగా ఓట్ల కోసం కోటి పాట్లు పడుతుండగా ఇగ సంతోషంతో జరుపుకునే వేడుకలు మరో ఎత్తు. వివాహ వేడుకలు బాగ జరుగుతున్న నేటి ఎన్నికల ప్రచారపర్వంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎక్కడ పెళ్ళి, చీరలు, పంచెలు కట్టించే ఫంక్షన్లు, మ్యాచ్ పంక్షన్లు, పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నా వెంటనే అక్కడకు వెళ్లి అంక్షితలు వేసి శుభాకాంక్షలు తెలియచేయడం, చిన్నారుల ఫంక్షన్లకు ఆశీర్వచనాలు అందచేయడం జరుగుతుంది. ఇంకా బాగా తెలిసినవారు, కావాల్సినవారైతే బర్త్ డే ఫంక్షన్లకు కేకులు, బిర్యానీలు కూడా అందచేస్తున్నారంటే ఆశ్చర్యమేమీకాదుమరి.వేడుకలకు హాజరైతే ఓట్లు వస్తాయని ఆశ, మంచి విందు బోజనం కూడా అక్కడక్కడ లాగించేస్తున్నారు.

ఏనాడూ ఎక్కడా కనిపించని ఆత్మీయత సభలు, సమావేశాల్లో ఎన్నికల సీజన్లో ఏరులై పారుతుంది. రిటైర్డు ఉద్యోగులు, విద్యుత్, ఆర్టీసి, పెన్షనర్లు, ఫలానా సామాజిక వర్గాలు, కుల, మత సమ్మేళనాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. సమావేశం నిర్వహించడం, పోటీలో ఉన్న అభ్యర్దిని ఈ రోజు ఒకరిని, మరో రోజు ఇంకొకరిని ఇలా మార్చి మార్చి ఏమార్చి మా ఓట్లన్నీ మీకే అని సమ్మబలికి మంచి మందు, విందు సమ్మేళనాలు ప్రస్తుతం ఎక్కడ చూసినా షరా మామూలే అన్నట్టుగా కోకొల్లలుగా జరుపుతున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలలో ఆత్మీయ ఆలింగనాలు, ఆత్మీయ సన్మానాలు కామన్ ప్రోగ్రాం.

ఇవే కాకుండా ఆయా దేవాలయాల్లో జరిగే మూకుమ్మడి అయ్యప్పమాలధారణలు, వెంకటేశ్వర మాలధారణలు, దేవాలయాల వరకు పాదయాత్రలు, మోకాళ్ళపై మెట్లు ఎక్కే కార్యక్రమాలు, కొత్త వాహనాలను
అభ్యర్థులు ఫస్ట్ నడిపించడం, కొత్త హోటళ్ళు, ఆసుపత్రులు, వస్త్ర దుకాణాలు ప్రారంభాలు ఇలా ఏ కార్యక్రమం జరిగినా, కొంత గుంపుగా అక్కడ ఎక్కడజనం వస్తున్నారంటే ముందుగా పోటీ చేసే అభ్యర్థులు అక్కడకు వెళ్ళి పలకరించడం, నవ్వులను మోమున పూయించుకుని హత్తుకుని ఆకట్టుకు కళలో ఆరితేరిన మహానటులు నేడు పోటీలో ఉన్న అభ్యర్థులు అని చెప్పక తప్పదు. ఇలా ఓట్ల ముందు కర్ణ కఠోర గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించి ఓట్ల తర్వాత ఏ విధంగా గెలిచిన వారి తత్వం ఉంటుందో వారి మనస్తత్వం మారుతుందో వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకొని ఓటు అనే బలమైన ఆయుధాన్ని సరిగ్గా ప్రయోగిస్తే సత్ఫలితాలు ఉంటాయి మరి ఏమంటారు. అవునంటారా...! కాదంటారా...!