'మహిమాన్విత క్షేత్రం' అన్నపూర్ణ కాశి విశ్వేశ్వరుని ఆలయం

'మహిమాన్విత క్షేత్రం' అన్నపూర్ణ కాశి విశ్వేశ్వరుని ఆలయం

నిత్య పారాయణం, మాసశివరాత్రికి అన్నదానం

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరుని ఆలయం మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్నది. ఆరోగ్యం సహకరించని వారు,ఆర్థికంగా లేనివారు, కాశీకి వెళ్లలేదన్న బెంగపడకుండా ఆ దేవుళ్లను సిద్దిపేటలోనే దర్శించుకుంటున్నారు.  సిద్దిపేటలో కొలువై ఉన్న శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంపై 'ముద్ర ప్రతినిధి' అందిస్తున్న ప్రత్యేక కథనం.స్థానిక కోమటి చెరువు వద్ద కొలువై ఉన్న ఈ ఆలయము 1970లో నిర్మితమైంది. అపర శివ భక్తులైన కొమురవెల్లి జోగయ్య, అనంతలక్ష్మి దంపతులు కాశీకి వెళ్లలేని నిరుపేదల కోసం సిద్దిపేటలోనే శ్రీ అన్నపూర్ణ కాశి విశ్వేశ్వర స్వామి దర్శనం చేయించడం కోసం ఈ ఆలయాన్ని నిర్మించారు. సిద్దిపేటలోనే 53 ఏళ్లుగా స్వామి,అమ్మవార్ల   దర్శనంతో లభిస్తుండడంతో భక్తులు పునీతులు అవుతున్నారు.ఈ దేవాలయంలో అన్నపూర్ణాదేవి విశ్వేశ్వర స్వామి తో పాటు గణపతి, భక్తాంజనేయ స్వామి, నవగ్రహ మండపము ఉన్నాయి. షిర్డీ సాయి నాధుడు,పుట్టపర్తి సాయిబాబా విగ్రహాలు కూడా నెలకొల్పారు.

ప్రతిరోజు ఉదయము  ఆలయ అర్చకులు దేశపతి గంగాధర శర్మ స్వామి,అమ్మవార్లకు అభిషేకము, అర్చనలు,హారతి ఇస్తుండగా భక్తులు ప్రతినిత్యం ఉదయం గంటన్నరసేపు గణపతి ప్రార్థన, శివ పంచాక్షరి శ్లోకాలు, శివాష్టకం, దుర్గ సప్తశ్లోకము, నవగ్రహ స్తోత్రము, హనుమాన్ చాలీసా, దుర్గా శతనామావళి, శివ అష్టోత్తర శతనామాలు, లింగాష్టకం పారాయణం చేస్తున్నారు.ఆలయంలో ప్రతి నెల మాస శివరాత్రి రోజున దాదాపు 500 మందికి అన్న దానం నిర్వహిస్తున్నారు.ఏటా మాఘ బహుళ చతుర్దశికి మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణము,చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం. ప్రతి ఏటా ఫాల్గుణ పంచమికి ఆలయ వార్షికోత్సవము నిర్వహిస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో కోమటి చెరువు సమీపాన ఉన్న ఈ ఆలయానికి ప్రతినిత్యం భక్తులు విచ్చేసి అమ్మ స్వామివార్లను దర్శించుకుని కాశీకి వెళ్లి వచ్చామన్న సంతృప్తిని పొందుతున్నారు.