వైద్య సేవలు నిల్- సంబరాలు ఫుల్!

వైద్య సేవలు నిల్- సంబరాలు ఫుల్!
  • ఆవిర్భావ వేడుకలపై కాంగ్రెస్ నేతల విమర్శలు


కేసముద్రం, ముద్ర: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన 108,104, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను సక్రమంగా అమలు చేయకుండా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల పేరుతో సంబరాలు చేసుకోవడం సరైనది కాదని కేసముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పేదల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి జిల్లా, డివిజన్, మండల స్థాయి ఆసుపత్రిలో సౌకర్యాలను మెరుగుపరచ లేకపోయారని ఆరోపించారు. 104 ద్వారా నిరంతరం గ్రామాల్లో పేద ప్రజలకు మందులు అందించే కార్యక్రమానికి తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు. గ్రామాల్లో ప్రజలకు నిత్యం అవసరమైన మందులను, వ్యాక్సిన్ లను అందుబాటులో ఉంచడం లేదని ఆరోపించారు. ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన బీఆర్ఎస్ సర్కార్ దశాబ్ది ఉత్సవాల పేరుతో ఆర్భాటం చేయడం తప్ప మరోటి లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేసముద్రం, ఇనుగుర్తి మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 30 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దనసరి ఎంపిటిసి ధరావత్ బాలు నాయక్, పోలేపాక నాగరాజు, అయుబ్ ఖాన్, బాలు నాయక్, సత్యానందం, కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, చిట్ల సంపత్, తాజుద్దీన్, గుండు గోపాల్ పాల్గొన్నారు