అత్తను హతమార్చిన అల్లుడు

అత్తను హతమార్చిన అల్లుడు
men killed a women

మెదక్, ముద్ర ప్రతినిధి: అత్తను అల్లుడు హతమార్చిన సంఘటన మెదక్ జిల్లా చిలిప్ చెడ్ మండల పరిధిలోని ఫైజాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల ప్రకారం... మృతురాలు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం ఎదురుగూడెం గ్రామానికి చెందిన అల్లాడ అనుసూజ (55), భర్త భోజిరెడ్డిల కూతురు సరితను 14 సంవత్సరాల క్రితం చిలప్ చెడ్ మండలం ఫైజాబాద్ గ్రామానికి చెందిన అంతిరెడ్డిగారి బుచ్చిరెడ్డికి(38) ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఒక కుమారుడు  నందీశ్వర్ రెడ్డి (12) ఉన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా మృతురాలి కుటుంబ సభ్యులు పెళ్లి సమయంలో పెట్టిన బంగారం అల్లుడు బుచ్చిరెడ్డి అమ్ముకున్నందుకు గొడవలు జరుగుతున్నాయి. 

గొడవలు జరుగుతుండడంతో మృతురాలు కూతురు సరితా ఆమె తల్లిగారి వద్దనే ఉన్నది. 6 నెలల క్రితం  మృతురాలి కూతురు సరితను ఫైజాబాద్ అత్తగారి ఇంటికి పంపించారు. సరిత మళ్ళీ సంక్రాంతి పండుగ ఉన్నందున తన కొడుకును తీసుకుని ఈ నెల 12న తల్లిగారి ఇంటికి వెళ్ళింది. తిరిగి 22న మృతురాలు తన కూతురును, మనుమడిని తీసుకుని ఫైజాబాద్ గ్రామానికి వచ్చింది. రాత్రి భోజనం చేసి అందజా 10 గంటల సమయంలో మృతురాలికి నిందితుడు అయిన బుచ్చిరెడ్డికి మధ్య అమ్ముకున్న బంగారం విషయమై గొడవ జరగగా మృతురాలిని పక్కగదిలోకి తీసుకెళ్లి తోసేయగా ఆమె తలకు బలమైన గాయంకాగా పక్కనే ఉన్న ఇనుప పానతో తలపైన కొట్టాడు. 

క్రింద పడి రక్తమును నీళ్లతో కడిగేసి సాక్షాలు లేకుండా చేశాడని పోలీసులు తెలిపారు. మృతురాలిని రాత్రి 12 సమయంలో నర్సాపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు చనిపోయినట్లు నిర్దారించారు. మృతురాలు కొడుకు రాఘవరెడ్డి ఫిర్యాదు మేరకు మృతుడు బుచ్చిరెడ్డిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు, నర్సాపూర్ సిఐ షేక్ లాల్ మదర్  తెలిపారు. మృతదేహాన్ని నర్సాపూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.