డబుల్ ఇళ్లలో మౌలిక వసతులు కల్పిస్తాం....

డబుల్ ఇళ్లలో మౌలిక వసతులు కల్పిస్తాం....
  • మూడు నెలల్లో లబ్ధిదారులను గృహప్రవేశం చేపించే బాధ్యత నాది.. .
  • ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 


ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలోని డబుల్ బెడ్రూం ఇళ్లలో మూడు నెలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని పట్టబద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్సీ  అధికారులతో కలిసి డబుల్ బెడ్ రూం ఇళ్లను సందర్శించి ఇళ్ల లబ్దిదారులతో సమావేశం నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ  డబుల్ బెడ్రూం ఇళ్లలో మౌలిక వసతులు కల్పనపై అధికారులతో సమీక్షించి, అంచనాలు రూపొందించి, పనులు ప్రారంభించి మూడు నెలల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నరు. ఉగాది నాటికి మురికికాలువలు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మౌలిక వసతులు కల్పించే బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు.  ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఎన్నికల ముందు ఆదరాబాదరాగా డబుల్ బెడ్ ఇళ్లల్లో మౌలిక వసతులు కల్పించకుండానే ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్నారు. తాను ఓడిపోయినప్పటికి , రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ప్రజల సమస్యలు పరిష్కరించే అవకాశం లభించిందన్నారు. వివిధ దశల్లో నిలిచిన 1600 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిచేసేందుకు కృషి చేస్తాను. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల స్థలంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఇందిరమ్మ లబ్ధిదారులకు తప్పకుండా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. వివిధ మతాల విద్యార్థులు చదువుకునేందుకు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని మతాల ప్రజల మత విశ్వాసాలకు అనుగుణంగా హిందువులకు రామ మందిరం, ముస్లింలకు మసీదు, క్రైస్తవులకు చర్చి, నిర్మాణం చేపట్టి, అన్ని మతాలను గౌరవిస్తామని అన్నారు.