కన్నతల్లే.... చంపింది

కన్నతల్లే.... చంపింది
  • బాలిక అనుమానాస్పద మృతి కేసులో... హత్యగా నిర్ధారణ
  • ప్రియుడి మోజులో సొంత బిడ్డను చంపిన తల్లి
  • నిందితుల అరెస్టు... రిమాండ్

ముద్ర, కుషాయిగూడ: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నాలుగున్నర ఏళ్ల బాలిక కేసులో కన్నతల్లే హంతకురాలిగా కుషాయిగూడ పోలీసులు నిర్ధారించారు. ప్రియుడి మోజులో పడి కన్న కూతుర్నే ఊపిరాడకుండా చేసి చంపిన హృదయ విధారక సంఘటన ఇది. సీఐ ప్రవీణ్ కుమార్ కథనం ప్రకారం... కుషాయిగూడ హనుమాన్ నగర్ కు చెందిన నయవాడి రమేష్ కుమార్, కుషాయిగూడ లోనే నివసించే జనగాం జిల్లా నర్మెట కు చెందిన కళ్యాణి(22) ని 2018లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రెండున్నరెండ్ల తర్వాత 2021లో విభేదాల కారణంగా విడిపోయారు.

ఈ క్రమంలో కళ్యాణి తన కూతురు తన్విత తో కలిసి కుషాయిగూడలో తన తల్లి , సోదరుడి వద్ద ఉంటుంది. కాగా ఈనెల 1వ తేదీన కళ్యాణి కూతురు తన్విత ఇంట్లో అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో కళ్యాణి భర్త తన కూతురు మృతికి తన భార్య కారణం అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానా స్పద మృతిగా కేసును నమోదు చేసి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా ఈ కేసులో కళ్యాణి ఫోన్ డేటా ఆధారంగా విచారించగా వాస్తవ విషయాలు బయటపడ్డాయి. అయితే భర్తతో విడిపోయి తల్లి వద్ద ఉంటున్న కళ్యాణికి జనగాం జిల్లా నారాయణపూర్ కు చెందిన ఇండ్ల నవీన్ పరిచయమయ్యాడు. ఈ క్రమంలో వారికి వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో అడ్డుగా ఉన్న తన కూతుర్ని తొలగించుకుంటే ప్రియుడితో వివాహానికి సులువుగా ఉంటుందని కళ్యాణి ప్రణాళిక రచించింది.

ఈనెల ఒకటో తేదీన ఇంటి నుంచి వచ్చిన తన కూతురు తన్వితకు భోజనం చేయించి పడుకోబెట్టింది. తర్వాత దిండుతో ముఖంపై అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. తర్వాత ఏమి తెలియనట్లు తన కూతురు భోజనం చేసి పడుకున్న తర్వాత అపస్మార్క స్థితిలో చేరుకుందని... నాటకం ఆడింది. విచారణలో వాస్తవ విషయాలను బయటపెట్టిన కళ్యాణి ని, ఆమె ప్రియుడు నవీన్ ను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్ తరలించారు. హత్యకు ఉపయోగించిన దిండును రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను పట్టుకున్న ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్సై షఫీ బృందాన్ని డిసిపి మల్కాజిగిరి జోన్ డి జానకి, కుషాయిగూడ ఎసిపి వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.