రెవె‘న్యూ' కే పరిమితమైన ఇనుగుర్తి!

రెవె‘న్యూ' కే పరిమితమైన ఇనుగుర్తి!
  • విభజనకు నోచని వివిధ శాఖలు
  • పూర్వ మండలానికి వెళుతున్న ప్రజలు


కేసముద్రం, ముద్ర: పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గ్రామాన్ని మండలంగా గత ఏడాది ఏర్పాటు చేశారు. నెల్లికుదురుతో పాటు కేసముద్రం మండలంలోని వివిధ గ్రామాలతో కొత్తగా మండలాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం గత డిసెంబర్లో కేవలం తహసిల్ కార్యాలయాన్ని మాత్రమే ప్రారంభించి మిగిలిన పోలీస్ స్టేషన్, మండల పరిషత్ ఏర్పాటు విషయాన్ని పట్టించుకోవడంలేదని ఫలితంగా కేవలం ఇనుగుర్తి మండలం రెవె‘న్యూ' కే పరిమితమైందని విలీన గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. కొత్త మండలం ప్రకటించి నెలలు గడుస్తున్నా పోలీస్ స్టేషన్ పరిధి మార్చకపోవడంతో ప్రస్తుతం ఇనుగుర్తి మండల పరిధిలో విలీనమైన గ్రామాల ప్రజలు అటు నెల్లికుదురు, ఇటు కేసముద్రం మండలానికి వెళ్లాల్సి వస్తోంది. నెల్లికుదురు మండలంలోని చిన్ననాగారం, మిట్యా తండా, పెద్ద తండా, చిన్న ముప్పారం తదితర గ్రామాల ప్రజలు ప్రస్తుతం ఇనుగుర్తి మండలంలో కొనసాగుతున్నప్పటికీ ఏదైనా నేరం జరిగినా, ఇతర కేసుల్లో నెల్లికుదురు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వస్తోంది. ఇక కోమటిపల్లి, అయ్యగారి పల్లి, పాత తండా, తారా సింగ్ తండా ప్రజలు కూడా ఇనుగుర్తి మండలంలో విలీనమైనప్పటికీ పూర్వ కేసముద్రం పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వస్తోంది. కొత్తగా మండలంగా ఏర్పడ్డ ఇనుగుర్తితో పాటు లాలు తండా, రాము తండా, చిన్యా తండా, మాస్కుంట తండా తదితర ఆవాస ప్రాంతాల ప్రజలు కూడా ఇనుగుర్తిలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయకపోవడంతో కేసముద్రం పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వస్తోంది.

ఒక పోలీస్ స్టేషన్ మాత్రమే కాకుండా జాతీయ ఉపాధి హామీ పథకం, విద్యా, వైద్య తదితర ప్రభుత్వ సేవలను పూర్వ మండలాల్లోనే కొనసాగిస్తుండడంతో ఇనుగుర్తి మండలం ‘పేరుకే' అన్న చందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలం పాటు ఇనుగుర్తి మండలం కోసం ఉద్యమాలు నిర్వహించగా ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం గత ఏడాది ఇనుగుర్తి మండలాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, కేవలం తహసిల్ ఆఫీసును ఏర్పాటు చేసి మిగిలిన వివిధ శాఖలను ఇనుగుర్తి మండలానికి కేటాయించకుండా కాలయాపన చేస్తోందని ఇనుగుర్తి మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నామ్ కే వాస్తే'గా ఇనుగుర్తి మండల ఏర్పాటు మారిందని, మండలం అయిందని నవ్వాలో, వివిధ శాఖలను కేటాయించకుండా జాప్యం చేస్తుండడంతో ఏడ్వాలో తెలియకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్తగా ఏర్పడ్డ ఇనుగుర్తి మండల పరిధిలోకి వివిధ ప్రభుత్వ శాఖలను విభజన పూర్తి చేసి, ఆయా శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని ఇనుగుర్తి మండల ప్రజలు కోరుతున్నారు.