వల్మిడి వైభవం..

వల్మిడి వైభవం..

  • శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ, విగ్రహాల పునః ప్రతిష్ఠాపనకు అంతా రెడీ
  • చినజీయర్ స్వామి నేతృత్వంలో పూజలు
  • హాజరు కానున్న మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్

ముద్ర ప్రతినిధి, జనగామ (పాలకుర్తి) :ఆది కావ్యం రామాయణాన్ని రాసిన వాల్మీకి పుట్టిన ఊరుగా ప్రతీతి చెందిన వ‌ల్మీడి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాల పునః ప్రతిష్ఠాపన, ఆల‌య పునః ప్రారంభ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా, అంగరంగ వైభవంగా జరుగనుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక శ్రద్ధతో ఇందుకు భారీ ఏర్పాట్లు జ‌రిగాయి. నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ ఉత్స‌వాల‌కు త‌ర‌లి వ‌చ్చే భ‌క్తుల కోసం అన్ని స‌దుపాయాల‌ను కల్పించారు. వ‌ల్మీడి రాములోరి గుట్టపై గ్రామంస‌హా పరిసర గ్రామాల్లో పండుగ వాతావ‌ర‌ణం ఉట్టిప‌డేలా మామిడి తోర‌ణాల‌ అలంక‌ర‌ణ‌లు జరిపారు.

తీర్థ ప్ర‌సాదాల విత‌ర‌ణ‌తోపాటు భ‌క్తుల‌కు ఆ సీతారాముల‌వారి క‌రుణా క‌టాక్ష వీక్ష‌ణాలు ల‌భించే విదంగా ద‌ర్శ‌నాలు జ‌రుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌పై ఈ నెల 22న 30న వ‌ల్మీడి గుట్ట మీద జిల్లా క‌లెక్ట‌ర్‌, అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్‌, వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు మాట్లాడుతూ, ఆది కావ్యంగా కీర్తినందుకున్న రామాయ‌ణాన్ని రాసిన వాల్మీకి వ‌ల్మీడికి చెందిన వాడుగా చ‌రిత్ర బెబుతున్న‌ది. ఇక్క‌డి మునుల గుట్ట మీద వాల్మీకి త‌పస్సు చేసేవాడ‌ట‌. ఆ ప‌క్క‌నే ఉన్న‌రాములోరి గుడి మీద రాముడు, సీత ఉండేవార‌ట‌. రాముడు, సీత స్వ‌యంభువులుగా వెలిశార‌ని, ఆయ‌న పాదాలు కూడా ఇక్క‌డ ఉన్నాయ‌ని ప్ర‌జ‌లు చెబుతున్నారు. ఆ రెండు గుట్ట‌ల మ‌ధ్య‌వాల్మీకి పురం ఉండేద‌ని, కాల క్ర‌మంలో అక్క‌డి ప్ర‌జ‌లంతా వ‌ల్మీడి గ్రామాన్ని నిర్మించుకున్నార‌ని చెబుతారు. ఇక ఇక్క‌డికి కూత‌వేటు దూరంలోనే మ‌హాక‌వి పాల్కురికి సోమ‌నాథుడు, స‌హ‌జ‌క‌వి బ‌మ్మెర పోత‌న‌ల జ‌న్మ‌స్థానాలున్నాయి. ఇంత పురాత‌న సాహిత్య చ‌రిత్ర ఉన్న ప్రాంతం ఈ భూమి మీద మ‌రోటి లేదు.

ఇంత గొప్ప చారిత్రాత్మ‌క ప్రాంతానికి మనమంతా చెందిన వారం కావడం మన అదృష్టం. అన్నారు. వ‌ల్మీడి రాములోరి గుట్ట మీద స్వ‌యంభుగా వెల‌సిన శ్రీ సీతారామ‌చంద్ర స్వామి దేవాల‌యాన్ని పునః ప్రారంభిస్తున్నాం. ఆల‌యంలోని విగ్ర‌హాల పునఃప్ర‌తిష్టాప‌న కార్య‌క్ర‌మాలు ఈ నెల 1వ తేదీ నుండి 4వ తేదీ వ‌ర‌కు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి విగ్రహాల పున: ప్రతిష్టాపన జరగనుండగా, అత్యద్భుతంగా తీర్చిదిద్దిన, కొత్తగా నిర్మించిన దేవాలయాన్ని సీఎం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల సీఎం రాలేకపోతున్నారు. అయితే అదే రోజు మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఇతర ప్రజా ప్రతినిధులు రానున్నారు. ఈ కార్య‌క్ర‌మాల‌కు సకుటుంబ సపరివార సమేతంగా తరలి రావాలని ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మ‌రోసారి పిలుపునిచ్చారు.

వల్మీడికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి ఆదేశాల మేరకు పాలకుర్తి చుట్టుముట్టున్న తొర్రూరు, హనుమకొండ, వరంగల్, జనగామ, డిపోల నుండి పాలకుర్తి కి వచ్చే బస్సులను వల్మీడి గుట్ట వరకు నడిపిస్తున్నారు.సకుటుంబ సపరివార సమేతంగా తరలి రావాలి. పాలకుర్తి నియోజకవర్గం వరంగల్ ఉమ్మడి జిల్లా ఇతర ప్రాంతాల వారు అందరూ సకుటుంబ సపరివార సమేతంగా ఈ ఉత్సవాలకు హాజరుకావాలని మంత్రి దయాకర్ రావు పిలుపునిచ్చారు.

నాలుగు రోజులు దేవాలయ ప్రాంగణంలో జరిగే నాలుగు రోజుల ఉత్సవాలలో ప్రతిరోజు సాయంత్రం నుండి రాత్రి వరకు జిల్లా పౌర సంబంధాల శాఖ అధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సినీ నేపద్య గాయని గాయకులు సంప్రదాయ నృత్య కళాకారులు, జానపద నృత్యాలు, గేయాలు, కోలాటాలు వంటి పలు తెలంగాణ కళా ప్రక్రియలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.